ఒక గర్భిణీ బస్సులో ప్రయాణం చేస్తుండగా మార్గం మధ్యలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఆసుపత్రి లేదు. అయితే బస్సును ఆపించి లేడీ కండక్టర్ ఆ గర్భిణీకి పురుడు పోసింది. అంతేకాదు ఆమెను స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఎంత మంచి మనసో కదా..
ఓ గర్భిణీ బస్సులో ప్రయాణం చేస్తుంది. ఉన్నట్టుండి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆ విషయం తెలుసుకున్న మహిళా కండక్టర్ ఆ మహిళకు పురుడు పోసింది. అంతేకాదు ఆమెకు ఖర్చుల కోసం డబ్బులు కూడా ఇచ్చింది. ఈరోజుల్లో ఇలాంటి మంచి మనుషులు కూడా ఉంటారా? ఇంతలా మనుషులను పట్టించుకునేవారు ఉన్నారంటే గొప్ప విషయమే. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో చోటు చేసుకుంది. సోమవారం కర్ణాటకలోని చిక్కమగళూరు డివిజన్ కి చెందిన కేఏ 18 ఎఫ్ 0865 అనే ఆర్టీసీ బస్సు బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తుంది. బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ బస్సులో ఒక గర్భిణీ కూడా ప్రయాణం చేస్తుంది.
ఆమె పేరు ఫాతిమా (22) అస్సాంలో పెరిగింది. బేలూరుకి వెళ్తుంది. హాసన్ లోని ఉదయపుర సమీపంలో వ్యవసాయ కళాశాల వద్ద మధ్యాహ్నం 1.25 గంటలకు ఫాతిమాకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమీపంలో ఆసుపత్రి కూడా లేదు. దీంతో ఎస్.వసంతమ్మ (52) అనే మహిళా కండక్టర్ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దించి ఆమెకు పురుడు పోశారు. తోటి మహిళా ప్రయాణికులు కూడా సహాయం చేయడంతో ఆ గర్భిణీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే గర్భిణీకి ఖర్చుల కోసం డ్రైవర్, లేడీ కండక్టర్ ఇద్దరూ ప్రయాణికుల దగ్గర నుంచి కొంత డబ్బు వసూలు చేసి, వారు కొంచెం డబ్బు వేసి మొత్తం రూ. 1500 ఆ తల్లికి ఇచ్చారు. అత్యవసర ఖర్చులకు ఉపయోగపడతాయని చెప్పి ఆమెకు ఇచ్చారు.
ఆ తర్వాత ఆమెను అంబులెన్స్ లో శాంతిగ్రామ్ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. మహిళకు పురిటినొప్పులు రావడం, పురుడు పోయడం.. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది ఆ మహిళా కండక్టర్. నిజంగా ఇంతలా పట్టించుకుంటారా? స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించడం అంటే మామూలు విషయం కాదు. చికిత్సకు డబ్బులు లేవని బస్సులో ప్రయాణికులను తలో కొంత వేసి ఆ డబ్బును ఆమెకు ఇచ్చారు. ఇది కదా మానవత్వం అంటే. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఈమె 20 ఏళ్ల క్రితం లేబర్ వార్డులో అసిస్టెంట్ గా పని చేశారు. ఆ తర్వాత కేఎస్ఆర్టీసీలో కండక్టర్ గా చేరారు.
అయితే ఈమె అప్పట్లో తీసుకున్న శిక్షణ బస్సులో ఒక మహిళకు పురుడు పోసేలా సహాయం చేసింది. కాగా ఈ ఘటనపై కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి. సత్యవతి బాసే స్పందించారు. గర్భిణీకి పురుడు పోసిన లేడీ కండక్టర్ ను, అలానే మహిళా ప్రయాణికులను అభినందించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు మానవత్వంతో స్పందించి ముందుకు రావడం అభినందనీయం అని కొనియాడారు. మరి సకాలంలో స్పందించి పేద మహిళకు పురుడు పోసిన కండక్టర్ కి, అలానే మహిళా ప్రయాణికులకు ఒక సెల్యూట్ చేయండి.