భారతీయ ఆయుర్వేదానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితమే.. అంటే మత్తుమందును అభివృద్ధి చేయని కాలంలోనే.. మన ఆయుర్వేద వైద్య నిపుణులు శస్త్ర చికిత్సలు సైతం నిర్వహించారు. ఇంగ్లీష్ వైద్యానికి లొంగని ఎన్నో వ్యాధులను ఆయుర్వేదం నయం చేసింది. పైగా దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ప్రపంచం అంతా మెచ్చిన ఆయుర్వేదాన్ని.. మనం మాత్రం చిన్న చూపు చూస్తున్నాం. ఇంగ్లీష్ వైద్యానికే జై కొడతాం. మనం పెద్దగా నమ్మని.. పట్టించుకోని ఆయుర్వేదంపై విదేశీ మాజీ ప్రధాని ఒకరు ప్రశంసలు కురిపించారు. ‘‘భారతీయ ఆయుర్వేదానికి చాలా శక్తి ఉంది.. దాని వల్లనే నా కుమార్తెకి తిరిగి చూపొచ్చిందని’’ తెలపడమే కాక.. తమ దేశంలో కూడా ఆయుష్ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోదీని కోరారు. ఆ వివారలు..
వ్యక్తిగత పర్యటన నిమిత్తం.. భారత్ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని రైలా మోలో డింగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. భారత్-కెన్యాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మోదీ ఆయనకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్‌లో వ్యక్తిగతంగా పర్యటిస్తున్న డింగాతో మోదీ భేటీ అయ్యారని, సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత ఆయనతో భేటీ అవడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్-కెన్యాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఇరువురి నేతల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది అంటూ డింగా ప్రశంసలు కురిపించారు. దాని వల్లే తన కుమార్తెకు తిరిగి చూపొచ్చింది అని తెలిపారు. తమ దేశంలో కూడా ఓ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా డింగా మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది కాలంగా నా కుమార్తె కంటి చూపు మందగించి.. ఇబ్బంది పడసాగింది. ఈ క్రమంలో మాకు కేరళలోని శ్రీధరీయం ఆయుర్వేదిక్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ గురించి తెలిసింది. నా కుమార్తెను అక్కడ చేర్పించి.. చికిత్స ఇప్పించాను. ఆయుర్వేద వైద్యం ఎంతో బాగా పని చేసింది. ఇప్పుడు నా కుమార్తెకు ఎలాంటి కంటి సమస్య లేదు. ఇందుకు సహకరించిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు’’ అన్నారు. అంతేకాక తమ దేశంలో కూడా ఆయుర్వేద వైద్యానికి సంబంధించి ఓ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అని తెలిపారు.
ఈ భేటీపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధానమంత్రి రైలా మోలో డింగాతో భేటీ అవడం సంతోషంగా ఉంది. భారత్‌లో, కెన్యాలో ఆయనతో సమావేశమైన సందర్భాలను నేను మళ్లీ గుర్తు చేసుకున్నాను’ అని మోదీ ఓ ట్వీట్ చేశారు. 2008 నుంచి 2013 వరకు డింగా కెన్యా ప్రధానమంత్రిగా పనిచేశారు. డింగా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.