ప్రపంచంలో ఎక్కడైనా సరే నెలకు ఒక్కసారి మాత్రమే జీతం ఇస్తారు. రోజు కూలీ పని చేసుకునే వారికి మాత్రమే ఏ రోజు డబ్బులు ఆరోజు ఇస్తారు. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ వారానికోసారి జీతం ఇస్తే.. వినడానికి ఇదేదో బాగున్నట్లు ఉంది కదా. అమలు చేసినా బాగుంటుందనే ఉద్దేశంతో ఓ కంపెనీ వారాని ఒక సారి జీతం ఇవ్వాలని నిర్ణయం తీసుకుని.. దేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా రికార్డు సృష్టించింది. ఆ వివరాలు..
ఇండియామార్ట్ అనే బీ2బీ ఈ-కామర్స్ కంపెనీ తన ఉద్యోగులకు వారానికోసారి జీతం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చెబుతున్నది. వారానికోసారి చెల్లింపులతో ఉద్యోగుల ఆర్థిక అవసరాలను సులువుగా తీర్చుకోవచ్చని, వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని వివరించింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, అమెరికాలో చాలా వరకు వారానికోసారి జీతం చేల్లిస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ వల్ల చెల్లింపులు, హెచ్‌ఆర్ వంటి విభాగాలపై అదనపు భారం పడుతుందని కొందరు చెబుతున్నారు. అయితే నెల మొత్తానికి లభించే జీతాన్నే ఒకేసారి ఇవ్వకుండా.. ఇలా వారానికి ఇంత అని ఇస్తారు అంతే తేడా. ఏది ఏమైనా దేశంలోనే ఇలాంటి భిన్నమైన నిర్ణయం తీసుకున్న తొలి కంపెనీగా ఇండియా మార్ట్ రికార్డు సృష్టించింది.