నాన్న ఆర్మీ జవాన్. దేశ ప్రజల భద్రత కోసం పోరాడి ప్రాణాలు విడిచాడు. ఇక నాన్న లేడని, లేవలేడని తెలియక పదేళ్ల చిన్నారి లే నాన్న అంటూ తండ్రి మృతదేహం వద్ద బోరున విలపిస్తోంది. పాప అలా ఏడవడం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
దేశ ప్రజల కోసం జవాన్లు అహర్నిశలూ పని చేస్తారు. ప్రాణాలకు తెగించి మరీ దేశ భద్రత కోసం పోరాడతారు. తుపాకీ తూటాలు, పేలుడు పదార్థాలు, బాంబులు ఇవేమీ వారి ధైర్యసాహసాలను ఆపలేవు. ఆపలేవు సరికదా.. మరణించినా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా, సజీవంగా జీవించి ఉంటారు. ఆర్మీ జవాన్ అంటే ఒక మిసైల్. ప్రాణం పోతుందని తెలిసినా దృఢంగా ఉంటారు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ తో బతుకుతుంటారు. కానీ భయం వారికి ఉండకపోవచ్చు, కానీ వారిని నమ్ముకుని జీవించే కుటుంబ సభ్యులకు ఉంటుంది. భర్త తిరిగొస్తాడని భార్య.. నాన్న వస్తే ఆడుకోవచ్చునని పిల్లలు.. ఇలా ఎంతో ఆశగా వచ్చే వరకూ ఎదురుచూస్తుంటారు.
నవ్వుతూ రావాల్సిన నాన్న.. మృత్యువు ఒడిలో తలవాల్చి వచ్చినప్పుడు ఆ దుఃఖం, బాధ వర్ణనాతీతం. జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరీలో జరిగిన ఉగ్రదాడుల్లో పారాట్రూపర్ నీలం సింగ్ మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం.. రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అడవిలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అడవిలోని ఓ గుహలో ఉగ్రవాదులను గుర్తించారు జవాన్లు. ఈ క్రమంలో జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పుల రణరంగం చోటు చేసుకుంది. జవాన్లపై ఉగ్రవాదులు పేలుడు పదార్థం విసరడంతో ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే మృతి చెందగా.. ముగ్గురు జవాన్లు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి మృత్యువు ఒడిలో చేరారు. మొత్తం ఐదుగురు జవాన్లు మృతి చెందారు.
మృతి చెందిన వారిలో హవిల్దార్ నీలం సింగ్ కూడా ఉన్నారు. ఈయన పార్థివదేహాన్ని శవపేటికలో శనివారం నాడు స్వగ్రామానికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చి ఆర్మీ జవాన్ నీలం సింగ్ కు నివాళులు అర్పించారు. తండ్రి పార్థివదేహాన్ని చూసి కూతురు పావన చిబ్ (10) బోరున విలపించింది. ‘నాన్నా నువ్వెందుకు లేవడం లేదు. నువ్వు తప్ప నాకేమీ వద్దు. ప్లీజ్ లే నాన్న’ అంటూ ఏడ్చేసింది. పక్కనే ఉన్న నీలం సింగ్ సతీమణి వందన.. భర్త ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని రోధించారు. కుటుంబ సభ్యులు, బంధువులు నీలం సింగ్ తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడని తెలిసి జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్స్ ని ఎంతగానో భావోద్వేగానికి గురి చేస్తోంది. తండ్రి లేడని, ఇక లేవలేడని తెలిసి ఆ పసి వయసు.. గుండెలు పగిలేలా నాన్నను పిలుస్తున్న సంఘటన అందరి హృదయాలను కలచివేస్తుంది. కాగా దలపత్ గ్రామంలో వేలాది మంది సమక్షంలో నీలం సింగ్ అంత్యక్రియలు ముగిశాయి. ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన జవాన్లకు అశ్రునివాళులు అర్పిద్దాం. సెల్యూట్ సైనికా..
VIDEO | Last rites of Martyr Havildar Neelam Singh at his native village in Akhnoor. The Indian Army lost five Bravehearts during an anti-terror operation in J&K’s Rajouri yesterday. pic.twitter.com/jWG4R1HTCy
— Press Trust of India (@PTI_News) May 6, 2023