ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO).. ఉద్యోగుల భవిష్యత్ అవసరాల కోసం కేంద్రం ఈ నిధిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగోలను పీఎఫ్ ఖాతాదారులుగా మార్చాయి. నెలనెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం మొత్తం అతని పీఎఫ్ ఖాతాకి బదిలీ అవుతుంది. అలాగే కంపెనీ యాజమాన్యం కూడా మరో 12 శాతం మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకి బదిలీ చేయడం జరుగుతుంది. ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత అతని జీవితం సాఫీగా సాగేలా, ఎవరిపై ఆధారపడకుండా బ్రతికేందుకు ఈ ఉద్యోగుల భవిష్యత్ నిధి అనేది అక్కరకు వస్తుంది. అయితే చాలా మంది కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు చేసి సైబర్ మోసగాళ్లకు చిక్కుతున్నారు.
పీఎఫ్ ఖాతాకు సంబంధించి.. ఇటీవలికాలంలో ఓ సంఘటన దేశవ్యాప్తంగా వైరల్ అవ్వడం చూశా. ముంబైకి చెందిన 47 ఏళ్ల వ్యక్తి తన పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో చెక్ చేసుకునే సమయంలో పొరపాటు చేశాడు. అదేంటంటే.. తన ఫీఎఫ్ బ్యాలెన్స్ చెక్‌చేసేందుకు ఆన్లైన్ లో ఒక కస్టమర్ కేర్ నంబర్ తీసుకున్నాడు. ఆ నంబర్‌కు కాల్ చేసి తన పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవాలి అని తెలిపాడు. వారికి తన ఖాతాకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని తెలియజేశాడు. అతనికి వచ్చిన పాస్ కోడ్‌ని కూడా వారికి తెలియజేశాడు. అతనితో ఓ రిమోట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా చెప్పారు. అలా చేయడం వల్ల అతనికి ఖాతా నుంచి 14 వేర్వేరు లావాదేవీల్లో మొత్తం రూ.1.23 లక్షలు కాజేశారు.
అయితే పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ కోసం అతను చేసిన చిన్న పొరపాటు ఆన్లైన్లో నంబరు తీసుకోవడం. అయితే అసలు పీఎఫ్ ఖాతా మొత్తాన్ని తెలుసుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించకుండా గుడ్డిగా ఆన్లైన్లో నంబర్లను తీసుకోకండి. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ఉమంగ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. బ్యాకింగ్ విధానంలో మాదిరిగానే ఈపీఎఫ్‌వో సంస్థ ఎప్పుడూ మీ వ్యక్తిగత సమాచారం అడగరు. ఆధార్, పాన్, యూఏఎన్ వంటి నంబర్లను ఎవరితోనూ షేర్ చేసుకోకండి. అసలు మీ పీఎఫ్ ఖాతా బ్యాలన్స్ మొత్తం ఎంతో తెలుసుకునేందుకు పోర్టల్, ఉమంగ్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. వాటిద్వారా సురక్షితంగా మీ బ్యాలన్స్ ని చెక్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్‌వో సేవల కోసం ప్రధానంగా మీరు పోర్టల్‌ని ఉపయోగించడమే సురక్షితం. EPFO ఇండియా అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత సర్వీసెస్‌లో ఎంప్లాయీస్‌పై క్లిక్ చేయాలి. దాని తర్వాత మెంబర్స్ పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే.. మీ యూఏన్ నంబర్, పాస్వర్డ్, ఒక సెక్యూరిటీ క్వశ్యన్ అడుగుతుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత మీ పీఎఫ్ ఖాతా ఓపెన్ అవుతుంది. అందులో మీ పాస్‌బుక్ నంబర్ని ఎంపిక చేసుకుని చెక్ బ్యాలన్స్ కొడితే మీ పీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నది తెలుసుకోవచ్చు. అలాగే ఏ నెల ఎంత మొత్తంలో ఖాతాలో జమయ్యాయి, మీరు ఎంత చెల్లిస్తున్నారు, మీ యజమాని తరఫున ఎంత జమవుతోంది కూడా తెలుసుకోవచ్చు.
భవిష్య నిధి ఖాతాదారులు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా కూడా మీ ఖాతా మొత్తాన్ని తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవాలి అంటే.. 011- 2290 1406 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే మీ ఖాతా మొత్తం మీకు సందేశం రూపంలో అందుతుంది. అలాగే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలి అంటే.. 77382 99899 నంబరుకు “EPFOHO UAN ENG” అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ద్వారా మెసేజ్ పంపాలి. అప్పుడు మీకు మీ ఖాతా మొత్తం ఎంతో ఉందో తెలియజేస్తూ రిప్లై వస్తుంది. మీకు ఏ భాషలో కావాలి అంటే ఆ భాష మొదటి 3 అక్షరాలను ఆఖరిని పెట్టి పంపాలి. ఉదాహరణకు “EPFOHO UAN TEL” అని మెసేజ్ పంపితే మీకు తెలుగులో సమాధానం వస్తుంది. కాబట్టి.. ఇంకెప్పుడూ ఆన్లైన్లో నంబర్లు తీసుకుని మోసపోకండి.