భారత్ తో స్నేహ సంబంధాలు అంటూనే మరోవైపు భారీ కుట్రలు పన్నుతుంటుంది దాయాది దేశమైన పాకిస్థాన్. భారత్ లో అరాచకం సృష్టించాలని అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి ఈ మద్య డ్రోన్ లను వాడుతున్నారు. భారత్ సైన్యం ఇలాంటి చర్యలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే వస్తుంది. అయినా కొంత మంది ఉగ్రమూకలు డ్రోన్ ద్వారా ఆయుధాలు సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
భారత్ లో అలజడి సృష్టించే క్రమంలో గత కొంత కాలంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పంజాబ్ సరిహద్దులో హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భద్రతా వర్గాలు చెప్పాయి. ఇటీవల కాలంలో శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్ కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. కాకపోతే ఈ డ్రోన్ ల కారణంగా అక్కడ గ్రామస్థులు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో మరోమారు డ్రోన్ కలకలం సృష్టించింది. తాజాగా ఉగ్రవాదుల కుట్రను భారత భద్రతా సిబ్బంది భగ్నం చేసింది.
కథువా జిల్లాలో బాంబులతో కూడిన ఒక డ్రోన్ ని భారత సైన్యం కూల్చివేసింది. పాకిస్థాన్‌కు చెందిన ఆ డ్రోన్ ఆయుధాలతో సరిహద్దు దాటినట్లు తెలిపాయి. భారత్‌లో విధ్వంసం చేసేందకు ఈసారి డ్రోన్లను తమ మార్గంగా ఎంచుకుని జమ్మూకాశ్మీర్‌లోకి పంపించినట్లు తెలుస్తుంది. కాగా, రాజ్‌బాఘ్ పోలీస్ స్టేషన్ పరిధి, తాలి హరియా చాక్ సరిహద్దుల్లో డ్రోన్ ఎగురుతుండటం కనిపించిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కాల్పులు జరిపి కూల్చివేసినట్లు జమ్ముకశ్మీర్ పోలీసు ప్రతినిధి తెలిపారు.