భార్యా భర్తల మధ్య ఏదో విషయంపై మనస్పర్థలు, గొడవలు రావడం కామన్. అవి సరిదిద్దుకుంటే సంసారమనే నావ సజావుగా సాగిపోతుంది. లేదు నేను చెప్పిందే చేయాలన్న మూస ధోరణిలో భర్త, భార్య ఉంటే ఎప్పటికీ గొడవలు సద్దుమణగవు. ఈ గొడవలే చినికి చినికి గాలి వానగా మారి.. పెను విషాదాలు నింపుతాయి.
వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. అయితే చిన్న చిన్న గొడవలు సహజం. ఇవి కూడా లేకపోతే అదీ సంసారం అనిపించుకోదు. అలా అని అస్తమాను భార్యపై భర్త చేయి చేసుకోవడాన్ని, కొడుతుండటాన్ని సంసారంలో భాగమే అని సమర్థించలేం. ఇంట్లో వీరి మధ్య జరిగే గొడవలు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చిపెడుతుంటాయి. అదే జరిగింది ఆ ఇంట్లో కూడా. పదే పదే భర్త వేధిస్తుండటంతో ఒక్కరు కాదూ ఇద్దరు కాదూ పది మందికి పైగా భార్యలు అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అయినా అతడిలో మార్పు రాలేదు. వివాహాల మీద వివాహాలు చేసుకుంటూ వచ్చిన.. భార్యలను బాధపెడుతున్నాడు. చివరకు ఒకరిని హత్య చేశాడు.
ఈ దారుణం జార్ఖండ్‌లోని గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గిరిదిహ్ జిల్లా జామ్‌దార్ పంచాయితీ తారాపుర్ గ్రామానికి చెందిన రామచంద్ర తూరి, తన భార్య సావిత్రి దేవీని కర్రతో కొట్టి చంపేశాడు. కాగా, ఆమె అతడికి 12వ భార్య కావడం గమనార్హం. ఆదివారం రాత్రి.. ఇంట్లో రామచంద్ర మద్యం సేవిస్తున్నాడు. ఈ సమయంలో భార్య సావిత్రీదేవితో అతనికి గొడవ జరిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భర్త.. భార్య సావిత్రిపై విచక్షణా రహితంగా కర్రతో దాడి చేశాడు. చనిపోయేంత వరకు కొడుతూనే ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన భార్య సావిత్రి దేవీ అక్కడిక్కడే మరణించింది.
ఈ విషయం పోలీసులకు తెలియగానే ఘటనా స్థలికి చేరుకుని రామచంద్రను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ‘నిందితుడు రామచంద్రకు గతంలో 11 పెళ్లిళ్లు అయ్యాయి. వారందరితో ఇలాగే గొడవ పెట్టుకుని, కొట్టడంతో భరించలేని ఆ 11 మంది భార్యలు .. అతడ్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. సావిత్రి ఆయనకు 12వ భార్య. రామ చంద్రకు పిల్లలు లేరు. సావిత్రి గతంలో పెళ్లి జరిగింది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు’అని గ్రామస్థులు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన పట్ల గ్రామస్థులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే 11 మంది భార్యలను కొట్టేవాడని తారాపూర్ గ్రామ సభ్యుడు చెప్పారు.