ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి సక్సెస్ సాధించారు. అవిభక్త కవలలుగా పుట్టిన చిన్నరులను ఆపరేషన్ సాయంతో విడదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
మనం సాధారణంగా అవిభక్త కవలలను చూసే ఉంటాం. శరీర భాగాలు అన్ని వేరుగా ఉండి తలలు మాత్రమే అతుక్కుని పుడతారు. మరికొందరు శరీర భాగాలు అతుక్కుని తలలు విడిగా ఉండి పుడతారు. ఇలా చాలామందికి జరుగుతుంది. తాజాగా ఢిల్లీలో మరో అవిభక్త కవలలకు సర్జరీ చేశారు డాక్టర్లు. శస్త్ర చికిత్స చేసి వారిని విడదీసి జీవం పోశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ అనంతరం ఆస్పత్రిలోనే ఫస్ట్ పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో గత ఏడాది క్రితం అవిభక్త కవలలు జన్మించారు. వారి పేర్లు రిద్ధి, సిద్ధి. వీరు తలలు, కాళ్లు, చేతులు వేరువేరుగా ఉండి, చాతిభాగం అతుక్కుని పుట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన దీపికా గుప్తా గర్భవతిగా ఉన్నపుడే కడుపులో అవిభక్త కవలలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. దీంతో అత్యాధునిక సౌకర్యాలున్న ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి ఆమెను రిఫర్ చేశారు. గత సంవత్సరంలో ఆమెకు అవిభక్త కవలలు జన్మించారు. ఛాతీ నుండి కడుపు వరకు అతుక్కుని జన్మించిన ఆడ కవలలను ఐదు నెలలపాటు ఐసీయూలో ఉంచారు. వారికి ఆపరేషన్ చేసినా తట్టుకునే కెపాసిటీ వచ్చిన పిదప సర్జరీ డేట్ ఫిక్స్ చేశారు. గత నెల 8వ తేదీన తొమ్మిది గంటలపాటు ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతం అయింది. తర్వాత వారి మొదటి పుట్టిన రోజును ఆస్పత్రిలోనే జరుపుకున్నారు. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రులు దీపిక, అంకుర్ గుప్తా డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆపరేషన్ జరిగేటప్పుడు చాలా ఆందోళన చెందామన్నారు. కానీ దేవుడు, వైద్యులు మా పిల్లలకు కొత్త జీవితం ప్రసాదించారు’ అని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డా. ప్రబుద్ గోయెల్ మాట్లాడుతూ.. ‘ఈ సర్జరీ చాలా ఛాలెంజ్‌గా ఉంది. ఈ కవలల్లో పక్కటెముకలు, కాలేయాలు, పాక్షికంగా డయఫ్రామ్, పెరికార్డియం కలిసి ఉన్నాయి. రెండు గుండెలు చాలా దగ్గరగా ఉన్నాయి. పెరికార్డియం కలసిపోయింది’. అని తెలిపారు. ‘సాధారణ పొత్తికడుపు, ఛాతీ వేరు చేయడం, ఇద్దరికి తగినంత కణజాలం ఉండే విధంగా కాలేయ కణజాల విభజన, అతుక్కుపోయి పక్కటెముక విభజన, డయాఫ్రామ్, పెరికార్డియం వేరు చేయడం లాంటివి ఈ సర్జరీలో చేశాము’ అని డాక్టర్ మిను బాజ్‌పాయ్ వివరించారు. రిద్ధి, సిద్ధితో కలిపి గత మూడు సంత్సరంలో మూడు సర్జరీలో చేశారు. మూడు ఆపరేషన్స్ సక్సెస్ అయినట్లు తెలిపారు.