తల్లిదండ్రులకు పిల్లలే లోకం. వారే సర్వస్వం. బిడ్డల బాగు కోసం నిత్యం తపిస్తుంటారు. పిల్లలకు చిన్న కష్టం కలిగినా.. తల్లిదండ్రులు తట్టుకోలేరు. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని.. తమకు దక్కని ప్రతిదీ తమ పిల్లలకు దక్కాలని ఆశిస్తారు తల్లిదండ్రులు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. బిడ్డల కోసం ఎన్ని కష్టాలనైనా భరించగలిగే తల్లిదండ్రులు.. కడుపు కోతను మాత్రం భరించలేరు. తమ సంతానం నిండు నూరేళ్లు.. పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. అలా కాకుండా తమ కళ్ల ముందే.. తమ కన్నా ముందే బిడ్డలు అనంత లోకాలకు వెళితే.. ఆ తల్లిదండ్రుల కడుపుకోతను తీర్చడం ఎవరి తరం కాదు. బతికున్నంత కాలం ఆ బాధ వారిని వెంటాడుతూనే ఉంటుంది.
ఛత్తీస్‌గఢ్ కు చెందిన ఓ దంపతులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. చేతికి అంది వచ్చిన కొడుకు తమకు ఆసరాగా ఉంటాడని భావిస్తే.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు. దేశం కోసం అమరుడైన కుమారుడి త్యాగానికి గుర్తుగా అతడి తల్లిదండ్రులు చేసిన పని ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి : IAS వెడ్డింగ్ ఇన్విటేషన్ వైరల్..! చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఛత్తీస్‌గఢ్, జష్పూర్ జిల్లా.. ఆరా గ్రామానికి చెందిన బషీల్ టోప్పో పోలీసు అధికారిగా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2011, బస్తర్ లో నక్సలైట్లతో జరిగిన ఎదురు కాల్పుల్లో బషీల్ టోప్పో వీర మరణం పొందాడు. చేతికి అంది వచ్చిన కొడుకు తమకు తోడుగా ఉంటాడని ఆశించిన అతడి తల్లిదండ్రులను విధి వెక్కిరించింది. కుమారుడి చేత తలగొరివి పెట్టించుకోవాల్సింది పోయి.. తామే కొడుక్కి అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం ఎంత కష్టమో అనుభవించేవారికే తెలుస్తుంది.
ఇంతటి దుఖంలో కూడా బషీల్ టోప్పో తల్లిదండ్రులు చాలా గొప్పగా ఆలోచించారు. తమ కుమారుడు దేశం కోసం తన ప్రాణాలు ఆర్పించాడు. కన్నీరు పెట్టుకుని.. కొడుకు త్యాగాన్ని తక్కువ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అంతేకాక కుమారుడి త్యాగానికి గుర్తుగా అతడి విగ్రహాన్ని తయారు చేయించి.. ఆలయం నిర్మించారు. ఇదంతా వారు తమ సొంత డబ్బుతో చేశారు. ఎవరి నుంచి సహకారం తీసుకోలేదు. ప్రతి రోజు కుమారుడి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ఆగస్టు 15, జనవరి 26 న ఇక్కడ జెండా ఎగురవేసి.. నివాళి అర్పిస్తారు. అంతేకాక ప్రతి ఏటా బషీల్ సోదరీమణులు ఈ విగ్రహానికి రాఖీ కడతారు. ఇక దీపావళి రోజున గ్రామస్తులంతా ఇక్కడే పండగ చేసుకుంటారు. అంతేకాక దేశం కోసం అమరుడైన బషీల్ ను ఎన్నటికి మరువం అంటున్నారు గ్రామస్తులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.