గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిన్న పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు కలత చెందుతున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్కుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఐదేళ్లలోపు పిల్లలకు మాస్క్ అవసరం లేదని స్పష్టం చేసింది. 6 నుంచి 11 ఏళ్ల వయసు వారికి తల్లిదండ్రుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉపయోగించే మాస్కులు వాడాలని సూచించింది. 12 ఏళ్లు దాటిన వారికి మాస్క్ కచ్చితమని పేర్కొంది.
ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయనే అంచనాల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఒక నిపుణుల కమిటీ తాజా మార్గదర్శకాలను రూపొందించింది. మరోవైపు 18ఏళ్ల లోపు వారికి అందించే చికిత్సకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు ప్రతిపాదించింది. ఒకవేళ స్టెరాయిడ్లు వాడితే వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వాటిని 10 నుంచి 14 రోజులకు తగ్గించాలని స్ఫష్టం చేసింది.
కరోనా లక్షణాలు కనిపించిన 3 నుంచి 5 రోజుల పాటు స్టెరాయిడ్లను వినియోగించకూడదని పేర్కొంది. వారికి ఇన్ఫెక్షన్ తీవ్రత ఎంత మేరకు ఉన్నప్పటికీ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీబాడీలు ఉపయోగించవద్దని ఆదేశించింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతీ ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మాస్కులు ధరించే విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది.