వైద్యరంగంలో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికి.. ఇప్పటికి కొన్ని వ్యాధులను నయం చేయలేకపోతున్నాం. ఇక కోవిడ్ మహమ్మారి విజృంభించిన వేళ.. మన జీవితాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో.. ప్రకృతి ముందు మన విజ్ఞానం ఎంత అల్పమైనదో అర్థం అయ్యింది. మనం ఎంతో అభివృద్ధి సాధించినట్లు జబ్బలు చరుచుకుంటున్నాం.. కానీ మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత అని అర్థం అయ్యింది. ఎప్పటికి నయం కానీ, ఎలాంటి చికిత్స లేని ఎన్నో అరుదైన వ్యాధులు నేటికి మన సమాజంలో అనేకం ఉన్నాయి. ఈ కోవకు చెందినదే ఇప్పుడు మీరు చదవబోయే వార్త. మనకు సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారితేనే ఎంతో చిరాకుగా ఉంటుంది. అలాంటిది.. పుట్టుక నుంచి ఆ సమస్యతో బాధపడుతూ.. వారానికోసారి కుబుసం విడిస్తూ.. నలుగురిలో కలవలేక.. బయటకు రాలేక ఓ వ్యక్తి నరకం అనుభవిస్తున్నాడు. ఆ వివరాలు..
బిహార్‌కు చెందిన 25 ఏళ్ల మజిబర్ రెహ్మాన్ మాలిక్ అనే ఈ యువకుడు ఎరిత్రోడెర్మా(Erythroderma) అనే ప్రాణాంతక చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల అతడి చర్మం వాచిపోతూ పొట్టుగా రాలిపోతుంటుంది. ఫలితంగా చర్మం ఎర్రగా కమిలిపోతుంది. ఈ పరిస్థితిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తుంటారు. మాలిక్‌కు పుట్టక నుంచే ఈ సమస్య మొదలైంది. ప్రతివారం అతడు కుబుసం విడుస్తున్నట్లుగా చర్మాన్ని వదులుతాడు. చలికాలం వచ్చిందంటే మరింత నరకం. అతడ చర్మం పొడిగా మారిపోయి చిట్లిపోతుంది. రక్తం కారుతుంది.
ఇది కూడా చదవండి: విడాకులు పొందితే తీసుకున్న కట్నం, నగలు తిరిగి ఇవ్వాల్సిందే: హైకోర్టు
ఈ సమస్యకు పరిష్కారం కోసం రెహ్మాన్ తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఎన్నో ఆస్పత్రుల్లో వైద్యం కోసం ప్రయత్నించారు. అయితే, ప్రతి డాక్టర్ చెప్పేది ఒకటే మాట. ‘‘ఇక్కడి ఆసుపత్రుల్లో ఈ సమస్యకు ట్రీట్మెంట్ లేదు. పెద్ద ఆసుపత్రులకు వెళ్లు’’ అని సూచించేవారు. కానీ, ఆర్థిక సమస్యల వల్ల అతడు, అతడి కుటుంబం ఆ ప్రయత్నం చేయలేదు. మాలిక్‌కు స్కూల్‌కు వెళ్లడమంటే చాలా ఇష్టం. అయితే, అతడి రూపాన్ని చూసి స్కూల్లో మిగతా పిల్లలు భయపడుతున్నారనే కారణంతో చదువుకు కూడా దూరమయ్యాడు.
ఇది కూడా చదవండి: 100వ పుట్టిన రోజు సందర్భంగా.. తల్లికి పాదపూజ చేసిన మోదీ.. ఫొటోలు వైరల్!
అయితే, తనకు ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ బాధతో కుమిలిపోవడం మాలిక్‌కు ఇష్టం లేదు. ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ తన పరిస్థితి గురించి ఇతరులకు వివరిస్తున్నాడు. ఈ చర్మ సమస్య వల్ల మాలిక్ కళ్లు ఎర్రగా మారిపోయాయి. ఒక కంటికి చూపు కూడా పోయింది. ఇంకో కన్ను కూడా క్రమేనా చూపును కోల్పోతున్నట్లు మాలిక్ చెప్పాడు. ‘‘నా సమస్యనే నేను నా బలంగా మార్చుకున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే కుమిలిపోకూడదు. ఇతరులు ఏమనుకుంటున్నారనేది నేను పట్టించుకోను. నా కుటుంబం, నా స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి, నేను హ్యాపీగానే ఉన్నాను’’ అని మాలిక్ తెలిపాడు. అయితే, మాలిక్ పరిస్థితి తెలుసుకున్న వారు.. అతడి వీడియోలు చూసినవారు.. పాపం.. అతడి వ్యాధికి చికిత్సే లేదా.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం లభించ.. ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకుంటే బాగుంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.