National Emblem: ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనంపై నాలుగు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు సింహాల విగ్రహం రూపు రేఖలపై ప్రస్తుతం వివాదం నెలకొంది. ప్రధాని ఆవిష్కరించిన విగ్రహంలోని సింహాలు మరీ క్రూరంగా ఉన్నాయంటూ దేశ వ్యాప్తంగా విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విగ్రహాన్ని తయారు చేసిన సునీల్ దేవ్డే అనే ఆర్కిటెక్ట్ స్పందించారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ విగ్రహం తయారు చేయటానికి ఓ సంవత్సరం పాటు పూర్తి నిబద్ధతతో పనిచేశాను. విగ్రహం చాలా బాగా వచ్చిందని నాకనిపిస్తోంది.
జాతీయ చిహ్నాన్ని తయారుచేసే అవకాశం నాకు లభించటం చాలా సంతోషంగా అనిపిస్తోంది. దీని కోసం నేను వంద శాతం శక్తి వంచన లేకుండా పనిచేశాను. ప్రభుత్వ సూచనల మేరకు సింహాలు మరింత ఆగ్రహంతో కనిపించేలా మార్పులు చేశారనే ఆరోపణల్లో నిజం లేదు. అశోక స్తంభంపై కనిపించే విగ్రహాన్ని అచ్చు గుద్దినట్లు అలానే తయారుచేశాం. ఆ విగ్రహంలోనూ సింహాల నోర్లు తెరిచే ఉంటాయి. దంతాలు కూడా కనిపిస్తాయి.
మేం కూడా అచ్చం అలానే తయారుచేశాం. ఈ విగ్రహం తయారీ పనులు మొదలుపెట్టి ఏడాదికిపైనే అయింది. ముందుగా మేం సారనాథ్ అశోక స్తంభంపై అధ్యయనం చేశాం. దాని చరిత్ర కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత తయారీ పనులు మొదలుపెట్టాం. మొదటగా ఔరంగాబాద్‌లో ఒక విగ్రహాన్ని రూపొందించాం. ఆ విగ్రహంలోని సింహాలు కింద నుంచి ఫోటోలు తీసినప్పుడు క్రూరంగా కనిపిస్తాయి.
మీరు సారనాథ్ అశోక స్తంభంపై చిహ్నాన్ని ఆ కోణంలో చూస్తే అలానే కనిపిస్తుంది. దీనికి ఆధారమైన ఆ విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని పెద్దగా చేశాం తప్ప.. ఎలాంటి మార్పులూ చేయలేదు. మేం తయారుచేసిన విగ్రహాన్ని పైనుంచి చూస్తే, సింహాలు ప్రశాంతంగానే కనిపిస్తాయి.
నాకు టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నుంచి ఈ ప్రాజెక్టు వచ్చింది. నేను ఆర్కిటెక్ట్, డిజైనర్‌గా పనిచేశాను. ప్రభుత్వ ప్రతినిధులతో నేను కలవలేదు’’ అని తేల్చి చెప్పారు. మరి, నాలుగు సింహాల విగ్రహం రూపొందించిన సునీల్ దేవ్డే చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : రేషన్ కార్డు దారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్ సిలిండర్!