మానవత్వానికి దాతృత్వానికి మారుపేరు అతడే సోనూసూద్. జూలై 29న 47వ ఏట అడుగుపెట్టాడు . పుట్టినరోజున మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు రియల్ హీరో సోనూసూద్.సినిమాల్లో అతను కరుడు కట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు.పుట్టినరోజు సందర్భంగా ప్రజలను ఆదుకునే మరిన్ని పనులు చేపట్టనున్నట్టు ప్రకటించాడు.
కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకు పోయిన కార్మికులను వాళ్ల స్వస్థలాలకు వెళ్లేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసాడు. కొంత మంది ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నాడు. మనం పురాణాల్లో శిబి చక్రవర్తి, కర్ణుడు గురించి విన్నాము.
తన దాతృత్వంతో కలియుగ కర్ణుడు, కలియుగ శిబి చక్రవర్తిగా ప్రజల నీరాజనాలు అందుకుంటున్నాడు సోనూ సూద్. ఎక్కడ కష్టం అని వినిపిస్తే చాలు వెంటనే వెళ్లి సాయం చేస్తున్నాడు సోనూసూద్. అక్కడ ఆయనున్నా లేకపోయినా సాయం మాత్రం వెంటనే జరుగుతుంది. మొన్నటి ఆదివారం రైతుకు ట్రాక్టర్ ఇచ్చినా.. సాఫ్ట్‌వేర్ శారదకు సాయం చేసినా.. దానికి ముందు వేలాది మంది వలస కార్మికులను సొంత డబ్బులతో ఇంటికి పంపించినా అన్నీ సోనూకు సాధ్యం అయ్యాయి.
ముంబాయిలో ఉన్న తన హోటల్‌లో డాక్టర్లకు, మున్సిపల్ వర్కర్లకు కోవిడ్ పై పోరాటంలో పాలు పంచుకునే అత్యవరసర సేవలు చేసే వాళ్లకు తన హోటల్లో బస కల్పించి దేవుడులా వారికి ఆసరాగా నిలిచాడు. కోవిడ్ హీరో సోను సూద్ మరో మంచి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. సమాజంలోని పేదవారికి సేవచేసేందుకు తన పుట్టినరోజును మరో అవకాశంగా మార్చుకున్నారు . కోవిడ్ సంక్షోభంలో విశ్రాంతి లేకుండా పనిచేసిన సోనూ సూద్.
తన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. జూలై 29న తన పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు సోనూ సూద్ . ఈ వైద్య శిబిరాల ద్వారా 50 వేల మందికి సేవలు పొందేలా ఏర్పాటు చేసారు.. ఈ వైద్య శిబిరాలను నిర్వహించేందుకు గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులతో సోనూ సూద్ ముందుగానే సంప్రదింపులు జరిపారు. పూర్తి ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని సోనూసూద్ చేపట్టారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు ప్రకటించారు.
ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, ఒడియా రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడానికి అక్కడి డాక్టర్లతో మాట్లాడానని సోను సూద్ తెలిపారు. ఈ పుట్టినరోజును సోనూ సూద్.. తన జీవితంలో ఒక ప్రత్యేక రోజుగా మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.. ఇవి ఎప్పుడూ నిర్వహించే వైద్య శిబిరాల మాదిరిగా ఉండవని.. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలి కాబట్టి కాస్త ఇబ్బంది ఉండొచ్చని సోనూసూద్ తెలిపారు. పెద్ద పెద్ద వాళ్లే చేయలేని పనులను సోనూ సూద్ ఒక్కడే చేసి చూపిస్తున్నాడు.
దైవం మానుష రూపేణా అంటూ ప్రజలతో కీర్తంపబడుతున్నాడు సోనూసూద్. 20 ఏళ్లుగా ఈయన నటనలోనే ఉన్నాడు. బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా సినిమాలు చేస్తున్నాడు సోనూ. ఒక్కో సినిమాకు భారీగానే తీసుకుంటాడు కూడా. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఆస్తుల విలువ దాదాపు 130 కోట్లు ఉంటుందని అంచనా. అందులో స్థిరాస్థులు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తాను సంపాదించిన మొత్తాన్ని ముఖ్యంగా హోటల్ బిజినెస్‌తో పాటు ఇళ్ళపై పెట్టినట్టు సమాచారం.
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు పోటీగా ప్రముఖ శిల్పి సునీల్ కందలూర్, పూనాకు సమీపంలోని లోనావాలాలో మైనపు విగ్రహాల మ్యూజియాన్ని 2010లో ఏర్పాటు చేసారు. అందులో సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఈ మైనపు మ్యూజియంలో జాతీయంగా, అంతర్జాతీయంగా మొత్తంగా 100 వరకు సెలబ్రిటీల మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసారు. అందులో మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు మైనపు విగ్రహాలున్నాయి. తాజాగా సోనూ సూద్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. మేడమ్ టుస్సాడ్స్‌ను తలతన్నేలా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసారు.