దేశంలో కోవిడ్ టీకా కార్యక్రమం 100 కోట్లు చేరుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది కరోనా ఎంత కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా ని కట్టడి చేయగలుగుతున్నాం. అయితే కొన్ని చోట్ల కరోనా వ్యాక్సిన్ అంటే భయపడిపోతున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే జ్వరం వస్తుందని.. ఒళ్లు నొప్పులతో కుంగిపోతారని రక రకాల పుకార్లు వస్తున్నాయి. దాంతో కొన్ని గ్రామాల్లో వ్యాక్సిన్ అంటే కిలో మీటర్ దూరం ఉరుకుతున్నారు.
వ్యాక్సిన్ వేసేందుకు ఇంటికి వచ్చిన వారిపై కొంతమంది తిరగబడుతున్నారు. తాజాగా కరోనా టీకా వేసేందుకు వచ్చిన వైద్య సిబ్బందిని ఒక మహిళ పాముతో బెదిరించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో చోటు చేసుకుంది. పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో ఇంటింటికి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. అక్కడ వ్యాక్సిన్ వేయించేందుకు ఓ ఇంటికి వెళ్లిన వైద్యసిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది.
తనకు వ్యాక్సిన్ అవసరంలేదని, దగ్గరికి వస్తే పాముతో కాటు వేయిస్తానని చెప్పి బుట్టలోనుంచి పామును తీసింది మహిళ. దీంతో ఆరోగ్యకార్యకర్తలు అక్కడ నుంచి పరుగు పెట్టారు. విషయాన్నిఊర్లోని పెద్దలకు చెప్పడంతో గ్రామస్తులు వ్యాక్సిన్‌పై మహిళకు అవగాహన కల్పించడంతో ఎట్టకేలకు ఒప్పుకొని వ్యాక్సిన్ తీసుకున్నది ఆ మహిళ. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.