1990 నుంచి 1996 మధ్య కాలంలో చిన్నారులను అపహరించి హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన కొల్హాపూర్ సోదరీమణులు రేణుకా షిండే, సీమా గావిత్‌లు దాఖలు చేసిన రివ్యూ క్షమాభిక్ష పిటిషన్‌పై బాంబే హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. న్యాయమూర్తులు నితిన్ జామ్దార్, సారంగ్ కొత్వాల్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఆ వివరాలు..
నేటి తరం వారికి ఈ కొల్హాపూర్ సిస్టర్స్ గురించి పెద్దగా పరిచయం ఉండదు.. కానీ 30 ఏళ్ల క్రితం వారికి ఈ అక్కాచెల్లెళ్లు బాగా తెలుసు. వారి పేరు వినిపిస్తే చాలు.. వెంటనే పిల్లల్ను దగ్గరకు లాక్కునే వారు తల్లిదండ్రులు. ఎందుకంటే ఈ అక్కాచెల్లెళ్లు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి వారి చేత భిక్షాటన చేయించేవారు. మాట వినని పిల్లల్ని దారుణంగా చంపేసేవారు. మనుషుల రూపంలో ఉన్న నరరూపా రాక్షసులు వీరు.
1990-96 వరకు దాదాపు ఆరేళ్లలో వీరు ఎందరో చిన్నారులను కిడ్నాప్ చేసి.. ఎన్నో కుటుంబాల్లో ఆరని చిచ్చు పెట్టారు. ఎందరో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. చివరకు వారి పాపం పండి పోలీసులకు చిక్కారు. వీరిద్దరితో పాటు ఈ అక్కాచెల్లెళ్ల తల్లి అంజనాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు చేసిన నేరాలకు గాను కోర్టు వీరికి మరణశిక్ష విధించింది.
న్యాయవాది అనికేత్ వాగల్ వీరి తరఫున దాఖలు చేసిన పిటిషన్ లో సోదరీమణుల మరణశిక్షను అమలు చేయడంలో సుమారు 8 సంవత్సరాలు విపరీతమైన జాప్యం జరిగినందున వారి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరారు. పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే వారి తల్లి అంజన మృతి చెందింది.
నిందితులను 2001లో కొల్హాపూర్‌లోని సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించింది. ఈ తీర్పును 2004లో హైకోర్టు, ఆ తర్వాత 2006లో సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ నిందితులు 2008లో తమకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా మహారాష్ట్ర గవర్నర్‌ను కోరారు. అయితే ఈ పిటిషన్‌ను 2012-13లో తిరస్కరించారు. ఆ తర్వాత, దోషులు క్షమాభిక్ష పిటిషన్‌తో రాష్ట్రపతిని సంప్రదించగా, 2014లో దాన్ని కూడా తిరస్కరించారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వీరిద్దరు క్షమాభిక్షకు అనర్హులని.. వీరికి ఉరి శిక్షే సరైందని ప్రకటించింది.