నేటి సమాజంలో అనురాగాలు, ఆప్యాయతలు కనుమరుగౌతున్నాయి. ఇంటికి వచ్చే అతిధులకు మర్యాదలు పక్కన పెడితే.. ఇంట్లో ఉండే వారికి సరైన తిండి పెట్టని రోజులివి. అయితే వారు చనిపోయాక భారీగా ఖర్చు పెట్టి దినం చేస్తారు. కొంత మందైతే ఖర్చు దండగా అని వదిలేస్తున్నారు. కానీ ఈ కుటుంబం కాస్త భిన్నం.
నేడు సంబంధ బాంధవ్యాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఆప్యాయత, అనురాగాలు కూడా వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్న చందంగా మారిపోయాయి. తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్దలెంతమందో. ముసలి వయస్సుకు వచ్చేసరికి వారికి సరిగా తిండి కూడా పెట్టరు. కొన్ని బాంధవ్యాలు ఇలానే ఉన్నాయి. కానీ వారు చనిపోయాక కర్మలతో పేరుతో ఊరు వాడను పిలిచి, వేటపోతులను కోసి వండి, వడ్డిస్తారు. చనిపోయిన వారు తినాలని పిండం పెడతారు. బతికున్నప్పుడు రాని ప్రేమ.. చనిపోయాక రావడం విడ్డూరం. కలుషిత మనషులు ఉన్న ఈ కాలంలో ఓ కుటుంబం మూగ జీవి పట్ల తమ ప్రేమను చాటుకుంది.
మిమ్మల్ని పెంచడం కన్నా ఓ కుక్కను పెంచుకోవడం నయం. ముద్ద వేస్తే విశ్వాసాన్ని చూపిస్తుందని ప్రతి ఇంట్లోనూ ఏదో ఓ విషయంలో ఈ మాట వినిపిస్తూనే ఉంటుంది. కానీ మనకు దగ్గరైన మూగ జీవి.. కానరాని లోకాలకు వెళ్లిపోతే ఆ బాధే వేరు. అటువంటి బాధనే అనుభవిస్తోంది ఓ కుటుంబం. పెంచుకున్న కుక్క చనిపోతే..దానిపై తమకున్న ప్రేమను దశ దిన కర్మ రూపంలో చూపించారు. ఊరు వాడ పిలిచి భోజనం పెట్టారు. కోనసీమ జిల్లాలోని అంగర అనే ప్రాంతంలో వీరరాజు కుటుంబం జీవిస్తోంది. వారు 14 ఏళ్ల క్రితం ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానికి పింకీ అని పేరు పెట్టుకున్నారు. అదీ వీరి పట్ల చాలా విశ్వాసంతో మెలిగేదట.
అయితే ఇటీవల ఈ కుక్క చనిపోయింది. తమతో ఇంట్లో మనిషిలా బంధాన్ని పెనవేసుకున్న కుక్క చనిపోవడంతో తల్లడిల్లిన ఆ కుటుంబం.. దశదిన కర్మ చేయాలని నిర్ణయించుకుంది. చుట్టాల, బంధువులు, స్నేహితులను పిలిచి భారీగా విందు భోజనం ఏర్పాటు చేశారు. వీరి బాధలో వచ్చిన వాళ్లు కూడా భాగస్వాములయ్యారు. మూగ జీవిలో దేవుడ్ని ఈ కుటుంబం చూసుకుందని వచ్చిన చుట్టాలంతా మెచ్చుకున్నారు. మనిషి బతికున్నప్పుడే కాదూ ఆఖరి కార్యాన్ని సైతం పట్టించుకోని ఈ రోజుల్లో కుక్క కోసం భారీగా దశ దిన కర్మ చేయడం నిజంగా అభినందనీయమే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.