సినీ పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని తమ మనసుకు నచ్చిన వారితో ఏడడుగులు వేస్తున్నారు. స్టార్ల ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ఇలా..
సినీ పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలంతా మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకుని తమ మనసుకు నచ్చిన వారితో ఏడడుగులు వేస్తున్నారు. స్టార్ల ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్, బేబి బంప్, బేబి షవర్.. ఇలా ప్రెగ్నెన్సీ నుండి డెలివరీ వరకు న్యూస్ ట్రెండ్ అవుతుంటుంది. ఇటీవలే యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కాడు.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఇప్పుడు మరో పాపులర్ యాక్టర్ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాడు. తెలుగు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆ నార్త్ నటుడు ఎవరో కాదు. సిల్వర్ స్క్రీన్ మీద తన మార్క్ విలనిజంతో ప్రేక్షకులను అలరించిన కబీర్ దుహాన్ సింగ్.
హర్యానాకు చెందిన కబీర్ దుహాన్ సింగ్.. మోడలింగ్ నుండి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.. గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘జిల్’ మూవీతో నటుడిగా తన కెరీర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫిలింలోనే ప్రతినాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. దీంతో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ‘డిక్టేటర్’, ‘కిక్ 2’, ‘స్పీడున్నోడు’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించాడు. తల అజిత్ ‘వేదాళం’ తో కోలీవుడ్‌లోనూ విలన్‌గా పరిచయమయ్యాడు. తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ భాషల్లోనూ టాలెంట్ నిరూపించుకున్నాడు. ఇటీవల సమంత ‘శాకుంతలం’ లో అసుర రాజుగా కనిపించిన కబీర్ ఇప్పుడు మరాఠీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఆయన మనువాడబోయే ఆమె పేరు సీమా చాహల్ అని.. తాను మ్యాథ్స్ టీచర్ అని తెలుస్తోంది. వీరి వివాహం జూన్ 23న ఫరియాబాద్, సూరజ్ ఖండ్‌లోని రాజాన్స్ హోటల్ (కన్వెన్షన్ హాల్) లో.. ఇరు కుటుంబాలు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగనుంది. జూన్ 21న మెహందీ ఫంక్షన్‌తో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యీయి.సీమాను వివాహం చేసుకోవాలనే తన కల నెరవేరబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ సంబరపడిపోతున్నాడు కబీర్. ముందు నుండీ తాను ఇండస్ట్రీకి చెందిన మహిళను కాకుండా.. బయట వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకున్నానని.. సీమాను ఫస్ట్ టైం చూడగానే తనే నాకు బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ అని ఫిక్సయిపోయానని అన్నారు.
ఆమెది సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేని చాలా సాధారణమైన కుటుంబ నేపథ్యమని.. తనతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ.. దేవుడికి, తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేశాడు కబీర్. ఇక వివాహం తర్వాత ఢిల్లీలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెస్షన్ ఏర్పాటు చేయనున్నారని, ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారని తెలుస్తోంది. వివాహ బంధంతో ఒక్కటవుతున్న కబీర్ దుహాన్ సింగ్, సీమా చాహల్‌కు సినీ పరిశ్రమ వారు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.