కొవిడ్‌తో బాధపడిన తర్వాత నెగటివ్ వచ్చింది కదా అని ఊరికే ఉండకుండా మంచి పోషకాలున్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. కీళ్లనొప్పులు, శ్వాసతో ఇబ్బంది, పొడి దగ్గు, ఒత్తిడి, డిప్రషన్, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొన్న కొవిడ్ బాధితులు ఈ ఆహారం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు ఉన్న ఆహారంలోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని, ముఖ్యంగా బియ్యం, పప్పు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో ఉండేలా చూసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. జామ, అరటి, బొప్పాయి, బత్తాయి, దానిమ్మ, యాపిల్ వంటి పండ్లను తీసుకుంటే పోషకాలు లభించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పాలు, గుడ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఉడకబెట్టిన శనగలు, జావ తరచుగా తీసుకుంటే అనారోగ్యం దాదాపు దరిచేరవని వారు పేర్కొంటున్నారు.
తోటకూర బలవర్ధకమైన ఆహారం. కరోనాతో బాధపడిన వారికి వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో పాటు వొంట్లోని నైట్రోజన్ తగ్గిపోతుంది. ఇలాంటి వారు తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సెలనియం, మెగ్నీషియం, ఐరన్‌తో పాటు ప్రొటీన్లు అందుతాయి. అందుకే గడ్డే కదా అని తోటకూరను తక్కువ అంచనా వేయకండి. పప్పులో వేసుకోవడం, తోటకూర ఫ్రై లాంటివి తినటం మంచిది.