మనిషికి చావంటే చాలా భయం.. చనిపోయిన వాళ్లంటే ఇంకా భయం. ఏ విధిలోనైనా ఏవరైనా చనిపోతే ఆ పక్కకు వెళ్లటానికి కూడా చాలా మంది భయపడతారు. అలాంటి చావులనే ఉద్యోగంగా చేసుకుని కొంతమంది జీవిస్తున్నారు. చచ్చిన శవాలతోనే వారు పని చేస్తుంటారు. వారే పాథాలజిస్టులు, పోస్టుమార్టం చేయటానికి సహకరించే ఇతర సిబ్బంది. వీరు రోజులో చాలా గంటలు శవాల మధ్యే నివసిస్తూ ఉంటారు. శవాలను కోస్తూ.. వారి మరణాలకు కారణం ఏంటా అని తెలుసుకుంటూ ఉంటారు. శవం ఎలాంటి స్థితిలో వచ్చిన.. వాళ్లు ఎలా చనిపోయి అక్కడికి వచ్చినా పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటుంది.
కొన్ని సార్లు పూర్తిగా కుళ్లిపోయిన శవాలతో కూడా పని చేయాల్సి వస్తుంది. ఇలాంటి ఉద్యోగాలను చాలా తక్కువ మంది కోరుకుంటారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన జెస్సికా లోగాన్ అనే యువతి ఆ కొద్ది మందిలో ఒకరు. ఆమె ఎంతో ప్యాషన్‌తో పోస్టుమార్టం నిర్వహించే ఉద్యోగంలో చేరారు. దానికోసం ఎంతో కష్టపడ్డారు కూడా. కంప్యూటర్ల ముందు గంటలు, గంటలు పనిచేయటం కంటే శవాల మధ్యలో హాయిగా ఉండటమే తనకు ఇష్టం అని ఆమె అంటోంది. అటాస్పీ అసిస్టెంట్‌గా తన అనుభవాలను చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ. ‘‘ కొన్ని కేసుల్లో బాడీలోని ఓ అవయవాన్ని లేదా..
ఒక దాని తర్వాత ఒక అవయావాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. నేను అన్ని అవయవాలను తొలగించటంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నాను. ఓ సారి నేను బాగా కుళ్లిపోయిన ఓ వ్యక్తి శవానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నాను. అతడి బాడీ నీటి కాల్వలో చాలా రోజులు ఉండటం వల్ల ఉబ్బి కుళ్లిపోయి ఉంది. నేను దానికి పోస్టుమార్టం నిర్వహిస్తుండగా తొడ భాగంలోంచి ఓ పాము బయటకు వచ్చింది. నాపై బుస్‌స్ మంది. నేను భయంతో షాక్ అయ్యాను. రూములో అటు, ఇటు పరిగెత్తాను. అది పక్కకు వెళ్లిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. అందుకే నాకు కుళ్లిపోయిన శవాలతో పనిచేయటం అంటే నచ్చదు. ఎందుకంటే వాటిలో కొన్ని రకాల జీవులు దాగి ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు.