‘మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ..’ అంటే ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. సరోగసీ పుణ్యమా అని ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పిల్లలు కావాలనుకున్న వారు.. మాతృత్వానికి నోచుకోనప్పుడు అద్దెగర్భం ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంటారు. దీన్నే సరోగసి అంటారు. ఈ విధానంలో ఫలదీకరణం చెందిన అండాలను మరో మహిళ గర్భంలో ప్రవేశపెట్టి, ఆమె ద్వారా సంతానం పొందుతారు. ఈ విధానం ద్వారా 56 ఏళ్ల ఓ మహిళ తన కొడుకు బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
అమెరికాలోని ఉటా ప్రాంతంలో నివసిస్తున్న జెఫ్ హాక్- కాంబ్రియా ఇద్దరూ భార్యా భర్తలు. కొంతకాలానికి కాంబ్రియా గర్భం దాల్చింది. అయితే అనుకోని కారణాల రీత్యా ఆమె గర్భాశయాన్ని తొలగించాల్సిందిగా డాక్టర్లు సూచించారు. బిడ్డను బ్రతికించుకోవడం కోసం ఆ దంపతులు చాలా ప్రయత్నాలు చేశారు. ఏవీ ఫలించలేదు. చివరకి సరోగసీని ఆశ్రయించాలనుకున్నారు. అది కూడా విఫలమయ్యింది. ఆ సమయంలో జెఫ్ హాక్ యొక్క 56 ఏళ్ల తల్లి నాన్సీ హాక్ సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే అందుకు ముందుకొచ్చింది. అలా నవమాసాలు మోసి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారికి పాప అమ్మమ్మకు నివాళిగా ‘హన్నా’ అని పేరు పెట్టారు.
ఈ విషయంపై నాన్సీ హాక్ మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం అని చెప్పుకొచ్చింది. ఉటా టెక్ యూనివర్శిటీలో పనిచేస్తున్న నాన్సీ, ఎలాంటి లింగ నిర్ధారణ పరీక్షలు లేకుండా కూడా తనకు ఆడపిల్లే పుడుతుందని నమ్మకంగా ముందే చెప్పడం గమనార్హం. ఆమె చెప్పినట్లుగానే ఆడపిల్ల పుట్టింది. మరోవైపు.. ఆ పాప జెప్ హాక్, కాంబ్రియాల ఐదో సంతానం కావటం గమనార్హం. ప్రస్తుతం ఆ పాప, ఆ చిన్నారి నానమ్మ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. 56 ఏళ్ల వయసులో ఆమె తీసుకున్న నిర్ణయానికి అందరి చేత ప్రశంసలు పొందుతోంది.