అందరూ అనుకున్నట్లుగానే జరిగింది. అనుకున్న దానికంటే కాస్త త్వరగానే జరిగిపోయింది. ఎంతో సునాయాసంగా తాలిబన్లు కాబూల్‌ను కూడా ఆక్రమించుకున్నారు. ఆఫ్గనిస్థాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. కాబూల్‌ను నాలుగు దిక్కుల నుంచి చుట్టుముట్టిన తాలిబన్లు నగరంలోకి దూసుకెళ్లారు. ఆఫ్గన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తునట్టు ఆఫ్గన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆఫ్గనిస్థాన్ తాత్కాలిక అధిపతిగా అలీ అహ్మద్ జలాలీ నియమితుడయ్యాడు. రక్తపాతం నివారించడానికి, శాంతియుతంగా తాలిబన్లకు అధికారం అప్పగించారు. తాము దాడులుచేయడం లేదని, శాంతియుతంగానే అధికారాన్ని స్వాధీనం చేసుకుంటునట్లు తాలిబన్లు కూడా ప్రకటన విడుదల చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని.. ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.
కాబూల్‌ను కూడా తాలిబన్లు ఆక్రమించడంతో అప్రమత్తమైన అమెరికా కాబూల్‌లోని తమ దౌత్య సిబ్బందిని తరలించేసింది. పలు చినూక్ హెలికాప్టర్లు అమెరికా దౌత్య కార్యాలయంపైకి చేరుకున్న కాసేపటికి దౌత్య కార్యాలయంపై నల్లటి పొగలు కనిపించడంతో.. పలు కీలక పత్రాలను తగలబెట్టి ఉంటారని భావిస్తున్నారు. తాలిబన్ల రాకతో పలు భవనాలు తగలబడుతూ కనిపించాయి. చెక్ రిపబ్లిక్ కూడా తమ దేశానికి చెందిన దౌత్య సిబ్బందిని అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించింది. తమ దౌత్య సిబ్బంది విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రష్యా ప్రకటన చేసింది.
తాలిబన్లు కాబూల్‌తో పాటు మిగిలిన నగరాలనూ స్వావధీనం చేసుకుని జెండా పాతేశారు. తాలిబన్ల అరాచకాలతో అక్కడి ప్రజల ప్రాణాలు అరచేతులో పట్టుకొని పారిపోతున్నారు. ఇల్లు, ఆస్తులను వదిలేసుకొని.. పిల్లాపాపలతో పక్క దేశాలకు శరణార్థులుగా తరలి పోతున్నారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆఫ్గనిస్థాన్ సరిహద్దును పాకిస్తాన్ పూర్తిగా మూసివేసింది. తాలిబన్లు ఎంట్రీతో.. కాబూల్‌లో బ్యాంకుల్లో నుంచి తాము దాచుకొన్న నగదు తీసుకోవడానికి ప్రజలు క్యూకట్టారు. ఇప్పటికే ఏటీఎంలు పనిచేయడం లేదు.
ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైన తర్వాత అక్కడ తాలిబన్ల అరచకాలకు అడ్డే లేకుండాపోయింది. అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణతో బైడెన్ ప్రభుత్వానికి అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. బైడెన్ తీరును తప్పుబట్టారు. బైడెన్ వైఫల్యం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.