ఆ అమ్మాయిది పాకిస్థాన్.. ఆ అబ్బాయిది ఇండియా. వీరిద్దరిని కలిపింది లూడో గేమ్. గేమ్ తో పాటుగా ప్రేమ పాఠాలు కూడా ఆడుకున్నారు ఆ ప్రేమ జంట. అతడి ప్రేమను పొందడానికి బోర్డర్ దాటింది ఆ యువతి. ఆ తర్వాత ఏం జరిగింది అంటే..
ప్రేమకు జాతి, కులం, మతం, రంగు, దేశాలతో సంబంధం ఉండదు. అది ఏ క్షణాన ఎప్పుడు.. ఎలా పుడుతుందో చెప్పలేం. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలో వెలుగు చూసిన ఓ ప్రేమ జంట కథ కాస్త గమ్మత్తుగా ఉంది. ఆమెది పాకిస్థాన్ కాగా.. అతడు ఇండియాలోని బెంగళూరు లో ఉంటున్నాడు. వీళ్లిద్దరిని కలిపింది ఆన్ లైన్ లూడో గేమ్. ఆ ఆటలోనే పనిలో పనిగా ప్రేమ పాఠాలు కూడా నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే అతడితో జీవితం పంచుకోవాలనుకుంది ఆ పాకిస్థాన్ యువతి. చివరికి ఏం జరిగింది అంటే..
యూపీకి చెందిన ములాయం సింగ్(26)కు లూడో గేమ్ ఆడే అలవాటు ఉంది. ఇతడు ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు. అయితే ఓ రోజు అతడికి లూడో గేమ్ లో పాకిస్థాన్ కు చెందిన ఇక్రా జివాని(19) పరిచయం అయ్యింది. అలా వారి లూడో పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇద్దరు ఆన్ లైన్ లో ప్రేమ ఆట ఆడుకున్నారు. ఇక నిండా ప్రేమలో మునిగిపోయిన ఆ యువతి అతడితో జీవితం పంచుకోవాలనుకుంది. దానికి అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇక్రాకు వీసా సమస్యలు ఎదురవ్వడంతో ములాయం సింగ్ తెలివిగా ఆమెను నేపాల్ కు రమ్మన్నాడు.
దాంతో ఆమె అలాగే గత సంవత్సరం సెప్టెంబర్ లో నేపాల్ లో దిగింది. వారు ఖాట్మాండ్ లోనే పెళ్లి చేసుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ఉండి.. సనోలీ సరిహద్దు ద్వారా ఇండియాలోకి ప్రవేశించి, బెంగళూరు చేరుకున్నారు. ఇక్రా తన పేరును ‘రవ’ అనే హిందూ పేరుగా మార్చుకుంది. వీరి కాపురం ప్రారంభం అయిన కొద్దిరోజులకే చుట్టు పక్కల వారికి అనుమానం వచ్చింది. ఎందుకంటే.. ఆమె తరచు నమాజ్ చెయ్యడం వారు చూశారు. హిందూ అమ్మాయి నమాజ్ చెయ్యడం ఏంటని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇక్రా, ములాయం సింగ్ లను అదుపులోకి తీసుకున్నారు. గూఢాచారి అన్న అనుమానంతో ఆ విధంగా విచారణ సాగించారు పోలీసులు. అయితే విచారణలో ఆమె.. అతడి కోసంమే ఇండియాకి వచ్చినట్లు నిర్ధారించుకుని సైనిక అధికారులు అట్టారి సరిహద్దు ద్వారా ఆమెను తిరిగి పాకిస్థాన్ కు పంపించారు. మరి ప్రేమ కోసం దేశం దాటి వచ్చిన ఆ యువతిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.