ఆకాశం నుంచి ఉన్నట్టుండి ఒక వస్తువు జారి పడింది. అతి పెద్ద వెలుగుతో అది భూమ్మీదకు చేరుకుంది. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
అప్పుడప్పుడు ఆకాశం నుంచి వింత వస్తువులు భూమ్మీద పడుతుంటాయి. వింత వింత వెలుగులు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఆకాశంలో వింత వెలుగు ఒకటి దర్శనమిచ్చింది. ఎవరో టార్చ్ లైట్ వేసినట్టు అతి పెద్ద కాంతి కనిపించింది. రాత్రి సమయంలో ఆ వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఎలా ఉందంటే సూర్యుడే భూమ్మీదకు మరింత దగ్గరకు వచ్చినట్టు ఉంది. చీకటిగా ఉన్న నగరం అంతా ఒక్కసారిగా పగటి పూటలా దర్శనమిచ్చింది. అయితే మొదట్లో పొరుగు దేశం చేస్తున్న వైమానిక దాడిలో భాగం అనుకున్నారు. దీంతో ప్రజలంతా ఆందోళన చెందారు. కానీ ఆ వెలుగుకి, వైమానిక దాడికి సంబంధం లేదని తెలిసింది. అసలేం జరిగిందంటే?
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారీ ఫ్లాష్ లైట్ ఒకటి ఆకాశంలో దర్శనమిచ్చింది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తున్న వేళ ఇలా ఫ్లాష్ లైట్ ఒకటి దర్శనమివ్వడం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కీవ్ గగనతలంలో ప్రకాశంవంతమైన వెలుగు ఒకటి కనిపించింది. మొదట్లో వైమానిక దాడి అని భావించారు. దీనికి సంబంధించి ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఆ వెలుగు నాసాకు చెందిన ఉపగ్రహానిదని.. ఉపగ్రహం కూలిపోయే సమయంలో వచ్చిందని వాయుసేన స్పష్టం చేసిందని కీవ్ సైనిక పరిపాలన అధికారి వెల్లడించారు. కాలం చెల్లిన ఓ ఉపగ్రహం బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని నాసా వారం రోజుల క్రితమే చెప్పింది.
ఈ ఉపగ్రహం వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతుందని.. అయితే కొన్ని భాగాలు మాత్రం వాతావరణ రాపిడిని తట్టుకోగలవని నాసా వెల్లడించింది. ఈ ఉపగ్రహం భూమ్మీదకు చేరినప్పుడు ఎవరికీ ప్రమాదం ఉండదని స్పష్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కమ్యూనికేషన్ కోసం, ఇతర సాంకేతిక అవసరాల కోసం నాసా ఉపగ్రహాలను పంపిస్తుంటుంది. ఈ క్రమంలో ఎప్పుడో పంపిన ఉపగ్రహం ఒకటి కాలం తీరడంతో భూవాతావరణంలోకి ప్రవేశించింది. ఒక్కసారిగా ఆకాశం నుంచి జారి పడింది. ఆ సమయంలో కీవ్ నగర గగనతలంలో ఒక భారీ వెలుగు కనిపించింది. అదన్నమాట విషయం.
Something happened in Kyiv sky tonight. The whole city is at a loss, what it was. UFO? pic.twitter.com/DAic7QHae2
— olexander scherba🇺🇦 (@olex_scherba) April 19, 2023