ఒక దేశంలోని ప్రజలను సుడిగాలులు మరోసారి భయపెట్టాయి. ఈసారి పెను బీభత్సం సృష్టించాయి. టోర్నడోల బీభత్సంలో 23 మంది చనిపోయారు. మరిన్ని వివరాలు మీ కోసం..
అగ్రరాజ్యం అమెరికాను ఎప్పుడూ టోర్నడోలు భయపెడుతూ ఉంటాయి. అక్కడ మరోసారి టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. యూఎస్‌లోని మిస్సిస్సిప్పి నగరంలో భారీ గాలులు, ఉరుములతో కూడిన వానల దెబ్బకు దాదాపు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుడిగాలుల వల్ల భారీ నష్టం జరిగిందని.. 160 కిలోమీటర్ల పరిధిలో టోర్నడోలు తీవ్ర ప్రభావం చూపాయని అత్యవసర నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాను తర్వాత వెస్ట్రన్ మిస్సిస్సిప్పిలోని సిల్వర్ సిటీలో అధికారులు, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. సుడిగాలుల విధ్వంసం అనంతరం నలుగురు వ్యక్తులు తప్పిపోయారని మిస్సిస్సిప్పి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ విషయాన్ని వరుస ట్వీట్లలో తెలిపింది.
ఇంత తీవ్రతతో సుడిగాలులు తామెన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. సిల్వర్ సిటీలో సుమారు 200 మంది నివాసం ఉంటున్నారు. పెనుగాలులు, వర్షం తర్వాత అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో శుక్రవారం రాత్రంతా ప్రజలు కారుచీకట్లోనే గడపాల్సి వచ్చింది. గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రులకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. టోర్నడోల బీభత్సంతో మిస్సిస్సిప్పి నగరంలోని చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పెను గాలుల ధాటికి వందలాది వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ టోర్నడోలు పలు పట్టణాల మీదుగా అలబామా వైపు దూసుకెళ్తున్నాయని మిస్సిస్సిప్పి అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికలు జారీ చేసింది.
First Light of Rolling Fork Mississippi after a Violent #Tornado last night. #mswx @SevereStudios @MyRadarWX pic.twitter.com/NG0YcI3TQn
— Jordan Hall (@JordanHallWX) March 25, 2023