సాధారణంగా ఏదైనా పెద్ద ప్రమాదం జరగడమో.. తలకు బలమైన గాయం తగిలితేనో.. మతి మరుపు వస్తుంది. గతం మర్చిపోతాం. కానీ జలుబు చేయడం వల్ల రాత్రికి రాత్రే గతం మర్చిపోయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చదివారా.. లేదా. అయితే ఇప్పుడు మీకు అలాంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాం. ఓ మహిళకు కుమారుడి నుంచి జలుబు అంటుకుంది. కొడుకు జలుబుతో బాధపడుతుంటే చూడలేక జండుబామ్ లాంటిది రాసింది. ఈ క్రమంలో ఆమెకు కూడా పడిశం పట్టుకుంది. ఆ తర్వాత నుంచి ఆమెకు తుమ్ములు మొదలయ్యాయి. అలాగే నిద్రపోయింది. తెల్లారి లేచింది. దిక్కులు చూస్తోంది. నిద్ర లేచిన తర్వాత నేను ఎక్కడ ఉన్నాను అని ప్రశ్నించడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఈ క్రమంలోనే ఆమె కోమాలోకి వెళ్లింది. ఈ వింత సంఘటన వివరాలు..
ఈ సంఘటన 2021లో చోటు చేసుకుంది. లండన్ కు చెందిన 43 ఏళ్ల క్లైర్ మఫ్పెట్ రీస్ అనే మహిళకు ఈ అనుభవం ఎదురయ్యింది. గతేడాది ఓ రోజు రీస్ కుమారుడికి జలుబు చేసింది. అతడి నుంచి రీస్ కు సోకింది. అది రెండు వారాల పాటు కొనసాగింది. అయితే జలుబు సోకిన మరుసటి రోజే రీస్ పరిస్థితి దారుణంగా ఉండటంతో.. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. రీస్ ముక్కు నుంచి విపరీతంగా నీరు కారుతుండటంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చారు. అక్కడో వారం ఉంచిన తర్వాత… రాయల్ లండన్ ఆస్పత్రికి తరలించారు. రెండు వారాల పాటు కోమాలో ఉన్న తర్వాత రీస్ కోలుకుంది.
కోమా నుంచి కోలుకున్న రీస్ వింతగా ప్రవర్తించడం ప్రారంభించింది. నేను ఎవరు.. ఎక్కడ ఉన్నాను.. మీరంత ఎవరు వంటి ప్రశ్నలు అడిగింది. రీస్ పరిస్థితి చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రీస్ ని పరీక్షించిన వైద్యులుమెదడువాపు కారణంగా ఆమె కోమాలోకి వెళ్లిందని.. ఫలితంగా గతం మర్చిపోయిందని గుర్తించారు. దాదాపు 20 ఏళ్ల గతాన్ని మర్చిపోయింది రీస్. వైద్యులు చికిత్స తర్వాత నెమ్మదిగా ఆమెకు గతం గుర్తుకు రాసాగింది. తల్లిదండ్రులను, చిన్న నాటి స్నేహితులను గుర్తించింది.. కానీ భర్తతో ఆమె ప్రేమ, పెళ్లి, కుమారుడి జననం ఇలాంటివి ఏవి ఆమెకు గుర్తు లేవు.
ప్రస్తుతం తనకు గుర్తొచ్చే ప్రతీ దాన్ని నోట్ కింద రాసుకోవడం ద్వారా గతాన్ని గుర్తు చేసుకోవడానికి రీస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ ఆమెకు కొంత గందరగోళం ఉంది. అయినప్పటికీ ఆమె తిరిగి జర్నలిస్టుగా తన కెరీర్ ప్రారంభించింది. తన గతం మొత్తం తిరిగి తనకు గుర్తొస్తుందని ఆశిస్తోంది. ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వాపు దినోత్సవం సందర్భంగా… రీస్ తన అనుభవాన్ని… స్పెఫ్స్ ప్యాక్డ్ లంచ్ కార్యక్రమంలో వివరించింది. ఆమె తన భర్త స్కాట్ తో కలిసి ఇందులో పాల్గొంది. ఏది ఏమైనా జలుబు కారణంగా గతం మర్చిపోవడం అంటే కాస్త విడ్డూరంగానే ఉంది. ఇక ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.