ఏదో తప్పక ఉద్యోగం చేయాల్సి వస్తోంది కానీ, చాలామందికి ఉద్యోగమంటేనే విరక్తి. 'సమయానికి వెళ్ళాలి.. పని చేయాలి.. ఇంటికిరావాలి' మనమొక రోబో అన్నమాట. ఒక ఎంటర్టైన్ మెంట్ ఉండదు. ఇంకెందుకు లేండి. ఉద్యోగాలు చేస్తుంటారుగా.. మీకు తెలుసు కష్టాలు. కానీ ఓ కంపెనీలో మాత్రం ఉద్యోగమొస్తే అదృష్టమనే చెప్పాలి. ఎందుకో తెలుకోవాలని ఉందా..? అయితే కింద చదివేద్దాం..
ఉద్యోగమంటే ఎలా ఉంటుంది? సమయానికి ఆఫీసుకు వెళ్ళాలి.. ఇచ్చిన పని పూర్తి చేయాలి.. ఆ పని అయ్యాక ఇంటికి రావాలి.. ఇదే కదా రొటీన్. అన్నీ సక్రమంగా జరిగితే సంస్థ నెల నెలా జీతమిస్తుంది. లేదంటే అందులో కోత తప్పదు. పోనీ ఇన్ని చేసినా అవసరమైనప్పుడు మన బాస్ సెలవులు ఇవ్వరు. ఎందుకు..? ఏంటి..? పోకుంటే ఏమైనా అవ్వుద్దా..? అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. ఇది అన్ని కంపెనీల్లో జరిగేదే. కానీ ఈ కంపెనీ మాత్రం ప్రత్యేకం. ఒకరకంగా చెప్పాలంటే ఈ కంపెనీలో ఉద్యోగం బంపరాపర్ అనుకోవచ్చు.
కోవిడ్ సృష్టించిన ప్రళయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మహమ్మారి దెబ్బకు అయినవారు ప్రాణాలుకోల్పోతే.. అంటిముట్టనట్టు వారిని పూడ్చిపెట్టాల్సి వచ్చింది. ఇక కంపెనీల విషయానికొస్తే.. కొన్ని పూర్తిగా మూతపడితే.. మరికొన్ని ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటూ పనిచేయించుకున్నాయి. ఇలానే చైనాకు చెందిన ఓ కంపెనీలో కలసి భోజనం చేసి మూడేళ్ళు అయిందట. ఈ క్రమంలో సదరు సంస్థ ఉద్యోగలందరూ కలవాలన్న ఉద్దేశ్యంతో.. ఒక చిన్న ఈవెంట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ విషయంలో సదరు కంపెనీ భిన్నంగా ఆలోచించింది. లక్కీ డ్రా ఏర్పాటు చేసి.. అందులో బహుమతులు, పెనాల్టీలు రెండూ ఉంచింది. ఈ లక్కీ డ్రాలో ఓ ఉద్యోగికి 365రోజులు సెలవు దక్కాయి.
అంటే ఎంచక్కా అతడికి ఏడాది పాటు జీతంతో కూడిన సెలవులు లభించాయన్నమాట. ఈ విషయం తెలిసి కంపెనీలోని తోటి ఉద్యోగస్తులే కాదు.. ప్రపంచం మొత్తం మీద ఉన్న ఉద్యోగస్తులందరూ అతనిపై అసూయపడుతున్నారు. ‘ఏం అదృష్టం నీది..’ అని కొందరు పొగుడుతుంటే, ‘ఏడాది పాటు జాబ్ చేయకుండా ఏం చేస్తావ్..’ అనేవారు మరికొందరు. ఇందులో తిరకాసు ఉందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘సంవత్సరం తరువాత నువ్ తిరిగి ఆఫీసుకు వెళితే ఖచ్చితంగా నీ ప్లేస్ లో వేరేవాళ్ళు ఉంటారు’ అని కామెంట్లు పెడుతున్నారు. మీ ఆఫీస్ లో కూడా ఇలాంటి ఈవెంట్లు పెట్టాలని కోరుకోండి.