క్రీడల్లో గెలుపోటములు సహజం. కానీ కొందరు వీటిని సమానంగా తీసుకోలేరు. గెలుపును సెలబ్రేట్ చేసుకుంటారు. ఓడిపోతే మాత్రం తట్టుకోలేరు. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాగే ఓ వ్యక్తి ఆటలో ఓటమిని తట్టుకోలేకపోయాడు. పట్టరాని కోపంతో అతడేం చేశాడంటే..!
ఆటల్లో గెలుపోటములు సహజం. ఒక మ్యాచ్‌లో గెలవడం, ఇంకో దాంట్లో ఓడిపోవడం ఇవన్నీ కామన్. మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతూ, పోటీకి తగ్గట్లు సన్నద్ధమవుతూ ముందుకెళ్లాలి. అప్పుడే నిలకడగా సక్సెస్ కాగలం. కానీ ఓడిపోయామని ఆవేశంలో అనవసర నిర్ణయాలు తీసుకోకూడదు. ఓడిపోయినప్పుడు గొడవలు జరిగిన ఘటనలను చూస్తున్నాం. గెలుపోటములను హుందాగా తీసుకోనప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ఓ ఘటనే బ్రెజిల్లో చోటుచేసుకుంది. ఒక యువకుడు ఆటలో ఓడిపోయాడు. దీంతో అక్కడున్న వాళ్లందరూ నవ్వారు. ఆవేశంలో మళ్లీ ఆడి చిత్తుగా ఓడిపోయాడు.
వెంటవెంటనే ఓడిపోవడంతో ఆ యువకుడ్ని అందరూ హేళన చేస్తూ బిగ్గరగా నవ్వారు. దీంతో అతడికి పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణికావేశంలో ఉన్నాదిగా మారిపోయాడు. అక్కడున్న ఏడుగుర్ని కాల్చి చంపేశాడు. బ్రెజిల్లో పూల్ గేమ్ ఆడుతుండగా జరిగిన ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వ్యక్తి పేరు ఎడ్గర్ రికార్డో డె ఒలివెయిరా. సహనిందితుడి పేరు ఇజెక్వియాస్ సౌజ రిబెయిరోలు. ఈ ఘటన తర్వాత ఇద్దరూ కలసి ఓ కుగ్రామంలో దాక్కున్నారు. అక్కడి నుంచి మరోచోటుకు పరారైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పూల్ గేమ్ ఆడుతున్న ఒలివెయిరా ఒక వ్యక్తి చేతిలో ఓడిపోయాడు. ఈ ఆటలో దాదాపుగా 776 డాలర్లు పోగొట్టుకున్నాడు. ఆ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ ఆడాలనుకుని ఫిక్స్ అయ్యాడు. దీంతో ఇజెక్వియాస్ అనే వ్యక్తిని వెంట తెచ్చుకున్నాడు. ఇంకో గేమ్ ఆడమంటూ సవాల్ విసిరాడు. అయితే రెండో గేమ్‌లోనూ ఓటమి తప్పలేదు. అక్కడ ఉన్నవాళ్లందరూ తెగ నవ్వారు. దీంతో పట్టరాని ఆవేశంలో ట్రక్కులోకి వెళ్లి షాట్ గన్ తీసుకొచ్చి పూల్ యజమానితో సహా అక్కడున్న ఏడుగుర్ని కాల్చి చంపేశాడు. మృతుల్లో 12 ఏళ్ల బాలిక కూడా ఉండటం గమనార్హం. డబ్బులతో పాటు అక్కడే ఉన్న ఓ మహిళ పర్సు తీసుకుని నిందితులు పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.