మానవుడు కోతి నుంచి వచ్చాడని అంటుంటారు. మొదట మానవుడికి తోకలు ఉండేవని క్రమేణా అవి అంతరించి పోయాయని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక బాలుడు మాత్రం తోకతో జన్మించాడు. ఫోర్టలెజా పట్టణానికి చెందిన నిండు గర్భిణి ఒకరు ఆల్బెర్ట్ సాబిన్ అనే పిల్లల ఆసుపత్రిలో చేరింది. సాధారణ ప్రసవానికి అవకాశం లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు బాలుడికి తోక ఉండడం చూసి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు.
ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివర ఒక బంతి ఆకారం ఉంది. నిజానికి మానవుని జనన సమయంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణలో మొదట పిండం తోకల రూపంలోనే పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయావలు ఏర్పడి పూర్తి మానవ శరీర రూపంలోకి మారిపోతుంది. అయితే శిశువు జన్మించిన సమయంలో ‘తోక’ 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. అయితే జన్యుపరమైన లోపల కారణంగా పిల్లలు ఈ విధంగా జన్మిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు.
ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు. ఈ అరుదైన మానవ తోకల గురించి సమగ్రంగా రేడియోలాజికల్ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తోకతో జన్మించిన బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. అతడి శరీరం నుంచి ఆ తోకను తొలగించమని వైద్యులు తెలిపారు.