ప్రపంచం వ్యాప్తంగా అనేక దేశాల్లో మన తెలుగు వారు ఉన్నారు. వివిధ పనుల నిమిత్తం వెళ్లి.. అక్కడే స్థిరపడిపోయారు. అంతేకాక మరికొందరు ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లి.. అక్కడి పరిపాలనల్లోనే కీలక వ్యక్తులుగా ఎదుగుతున్నారు. ఇలా ఎందరో తెలుగువారు పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉంటూ తెలుగు ఖ్యాతిని మరింత పెంచుతున్నారు. తాజాగా మరో తెలుగు తేజం అమెరికా ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. తెలుగు మూలాలు ఉన్న అరుణా మిల్లర్.. మేరీలాండ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఆదేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. ఈఘనత సాధించిన తొలి ఇండో-అమెరికన్ గా అరుణ రికార్డు కెక్కారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మధ్యతర ఎన్నికలు వచ్చాయి. ఆ మధ్యతర ఎన్నికల జరిగే స్థానాల్లో మేరి లాండ్ స్టేట్ కూడా ఒకటి. ఇక్కడ అధికార డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా అరుణా మిల్లర్ బరిలో దిగారు. ఆమెకు మేరిలాండ్ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈక్రమంలో విజయం కోసం అరుణా విస్తృత ప్రచారం చేశారు. ఆమె గెలుపు కోసం అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్ కూడా మేరీలాండ్ పట్టణంలో ప్రచారం చేశారు. మంగళవారం పోలింగ్ నిర్వహించగా… బుధవారం వాటి ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో అరుణా మిల్లర్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా ఘన విజయం సాధించారు.
డెమోక్రాట్లతో పాటు విపక్ష రిపబ్లికన్ల మద్దతు కూడా కూడగట్టిన అరుణా మిల్లర్ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ ఎన్నికతో అమెరికాలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా, తెలుగు తేజంగా అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. అరుణా మిల్లర్ తనదైన శైలిలో ప్రచారం చేసి తనతో పాటు మేరీలాండ్ గవర్నర్ పదవికి పోటీ చేసిన డెమోక్రటిక్ అభ్యర్థి వెస్ మూర్ కి కూడా విజయం అందించారు. అమెరికాలో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకమైనది. కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. 1964 నవంబర్ 6న జన్మించిన ఆమె.. కుటుంబంతో కలిసి 1972లో అమెరికా వెళ్లారు. అరుణ తండ్రి ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేశారు.
ఈమె ప్రాథమిక విద్యను న్యూయార్క్ లో పూర్తి చేశారు. అనంతరం మిస్సౌరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. తన కళాశాల స్నేహితుడు డేవిడ్ మిల్లర్ ను అరుణ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. 2000లో ఆమెకు అమెరికా పౌరసత్వం లభించింది. 2018లో అమెరికా పార్లమెంట్ కు పోటీపడి ఓడారు. అయిన పట్టువదలక అంచెలంచెలుగా ఎదిగి డెమెక్రటికి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. తాజాగా మన తెలుగు అరుణోదయం.. అరుణ.. లెఫ్టినెంట్ గవర్నర్ గా విజయం సాధించి అమెరికాలో చరిత్ర సృష్టించింది. ఈ మధ్యతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత అమెరికన్లు ఎన్నికయ్యారు.