కుళ్లిన స్థితిలో ఉన్న ఓ శవాన్ని చూస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది ఏకంగా 200 శవాలు కుళ్లిన స్థితిలో కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? దారుణంగా ఉంటుంది కదూ. పాకిస్తాన్‌లోని ఓ ఆసుపత్రి మేడపై 200 శవాలు కుళ్లిన స్థితిలో దర్శనమిచ్చాయి. వాటిలో మహిళలు, చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు తారీక్ జమాన్ గుజ్జర్ తెలిపిన వివరాల మేరకు.. ‘‘ నేను శుక్రవారం ముల్తాన్ సిటీలోని నిష్‌తార్ ఆసుపత్రి పర్యటనకు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు. ‘మీకు మంచి చేయాలన్న ఉద్ధేశ్యం ఉంటే మార్చురీ దగ్గరకు వెళ్లి చూడండి’ అని అన్నాడు.
నేను మార్చురీ దగ్గరకు వెళ్లాను. అక్కడి సిబ్బంది దాని తలుపులు తీయటానికి ఇష్టపడలేదు. తలుపులు తీయకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించాను. కొద్ది సేపటి తర్వాత తలుపులు తీశారు. నేను మార్చురీ లోపలి మేడపైకి వెళ్లాను. అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యాను. దాదాపు 200 శవాలు కుళ్లిన స్థితిలో పడిఉన్నాయి. అన్ని శవాలకు దుస్తులు లేవు. నగ్నంగా పడి ఉన్నాయి. వాటిలో ఆడ, చిన్న పిల్లల శవాలు కూడా ఉన్నాయి. నేను వారిని దీనిపై గట్టిగా అడిగాను. ‘మీరు వీటిని అమ్ముతున్నారా? అని మార్చురీ అధికారుల్ని ప్రశ్నించాను. అవన్నీ మెడికల్ స్టూడెంట్స్ కోసం వాడిన శవాలని వారు తెలిపారు.
వాటిలో ఓ రెండు శవాలు అప్పుడే అక్కడకు వచ్చినట్లు ఉన్నాయి. అప్పుడప్పుడే కుళ్లుతున్నాయి. ఇక, అన్ని శవాలకు పురుగులు పట్టి తింటున్నాయి. నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి ఓ దృశ్యం నేను ఎప్పుడూ చూడలేదు. వాటన్నిటిపై కొన్ని రకాల పురుగులు వాలి దారుణంగా కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి పర్వీజ్ ఇలాహీ సీరియస్ అయ్యారు. ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి: Viral Video: వైరల్ వీడియో: ఇదేం ఫైట్‌రా బాబు.. స్టోర్‌లో కొట్టుకున్న కస్టమర్లు..