ఉద్యోగ ఒత్తిడి, పర్సనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఎటు వైపు ఒత్తిడి కలిగినా నరకమే. పొద్దునే 10 గంటలకు క్యారీయర్ మోసుకుని, సాయంత్రం ఆరు దాటినా ఉద్యోగం చేస్తుండటంతో జీవితంపై విరక్తి చెందుతున్నారు. సరిగా పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇదే విషయాన్ని గ్రహించిన ఓ సంస్థ తీసుకున్న నిర్ణయం భలేగా ఉందనిపిస్తోంది.
పని, పని, పని దీన్ని కనిపెట్టిన వాడెవడో కానీ..అంటూ ప్రస్టేషన్ డైలాగులు వచ్చేస్తుంటాయ్. సగం జీవితం ఆఫీసులో గడిచిపోతుందనుకుని గగ్గోలు పెడుతున్న వేతన జీవులందరూ ఇలానే భావిస్తుంటారు. పని వేళలు గడిచిపోయినా పని చేయాల్సి వచ్చినా, బాస్ మరింత పని చెప్పినా, మాతో గడపడం లేదని కుటుంబం సభ్యులు మొరపెట్టుకుంటున్నా, ఒత్తిడితో కూడిన ఉద్యోగంపై శ్రద్ధ పెట్టలేరు. ఇటీవల ఐటి ఉద్యోగుల్లో ఈ ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. వర్క్ ఫ్రం హోం వాళ్లు మినహాయిస్తే.. ఆఫీసులకు వెళుతున్న వారు సైతం.. ఇంటికి వచ్చాక లాప్ టాప్ లతో కుస్తీలు పడుతున్నారు. వర్క్, ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోలేక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కరోనా సమయంలో ఇళ్లకు పరిమితమై విధులు నిర్వర్తించిన వారంతా.. ఇప్పుడు ఆఫీసులకు రావడంతో టెన్షన్ పడిపోతున్నారు. పని ఒత్తిడికి గురౌతున్నారు. కొన్నిఐటి కంపెనీలు ఉదారత చూపించి.. వారంలో రెండు మూడు రోజుల కొకసారి ఆఫీసులకు రావాలని చెబుతుంటే.. మరి కొన్ని రోజువారీ రావాల్సిందేనని చెబుతున్నాయి. 10 టు 6 జాబ్ నిమిత్తం ఆఫీసుకు వెళ్లి ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ ను మిస్ అవుతున్న వారంతా అనాలోచిత నిర్ణయాలకు తీసుకుంటున్నారు. ఈ తీవ్ర నిర్ణయాల పట్ల కూడా ఆందోళన చెందిన ఒక కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు అవ్వగానే ఇంటికి వెళ్లిపోండి అని చెబుతోంది. అబ్బా ఎక్కడుందీ ఈ సంస్థ అనుకుంటున్నారా..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో. అదే ఐటీ కంపెనీ సాఫ్ట్‌గ్రిడ్ కంప్యూటర్స్. ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లో బెల్ కొట్టగానే ఇంటికి పరుగులు పెట్టాలన్నట్లుగా.. ఈ ఐటి కంపెనీ సైతం ఠంచనుగా టైమ్ ను పాటిస్తుందట. అక్కడ ఉద్యోగులు తమ పనివేళలను మించి పనిచేయకుండా ఓ వినూత్న ప్రయత్నం చేసింది. ఒకవేళ షిఫ్ట్ టైం దాటిపోయి ఉద్యోగులు పనిచేస్తున్నట్లయితే వారి కంప్యూటర్లు ఆటోమేటిక్‌గా అంటే వాటంతటవే షట్ డౌన్ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన లింక్డ్‌ఇన్ పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేసే ఒక ఉద్యోగి ఈ ఫొటోను షేర్ చేశారు.
ఒక ఉద్యోగి తన డెస్క్‌లో కూర్చోగా.. ఎదురుగా ఉన్న కంప్యూటర్‌లో వార్నింగ్ అలర్ట్ వచ్చింది. అక్కడ కనిపించే వార్నింగ్ అలర్ట్ ఏంటనుకుంటున్నారా? ‘వార్నింగ్.. మీ షిఫ్ట్ టైం అయిపోయింది. ఆఫీస్ సిస్టమ్ 10 నిమిషాల్లో షట్ డౌన్ అవుతుంది. దయచేసి ఇంటికి వెళ్లిపోండి.’ అని అందులో ఉంది. దీంతో ఆ ఉద్యోగులు సైతం ఎగ్గొట్టకుండా ఉద్యోగాలకు వస్తున్నారట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో భాగంగా తమ కంపెనీ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న స్నేహపూపర్వక ధోరణికి ఇది నిదర్శమని పేర్కొన్నారు. ఆఫీసు సమయం గడిపోయాక కాల్స్ కానీ, మెయిల్స్ కూడా పంపేందుకు అవకాశం లేదని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. దీని వల్ల మండే మోటివేషన్ గా.. శుక్రవారం మరింత ఫన్ గా తయారవుతుందని అన్నారు. మా కంపెనీలు కూడా ఇలా మారిపోవాలనుకుంటున్నారు. ఆరైందీ ఇంటికి వెళ్లిపోండీ అని మీ సిస్టమ్ లు కూడా వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.