గుంటూరు- రాజకీయాలకు, సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. జాతీయ రాజకీయల నుంచి మొదలు, ప్రాంతీయ రాజకీయల వరకు చాలా మంది సినీ రంగ ప్రముఖులు రాజకీయ పార్టీల్లో చేరి తమను తాము నిరూపించుకున్నారు. సినిమా రంగానికి చెందిన ఎంతో మంది రాజకీయాల్లో సక్సెస్ సాధించి, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు.
ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనే కదా మీరు ఆలోచిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. తెలుగు రాజకీయాల్లో మరో సినీ నటుడు ఓ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతనెవరో కాదు.. ఒకప్పటి గ్లామర్ హీరో, ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్త్ సుమన్. అవును సినీ నటుడు సుమన్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో హీరో సుమన్ పాల్గొనడం హాట్ టాపిక్ అవుతోంది.
సీఎం జగన్ బర్త్ డే వేడుకలో భాగంగా గుంటూరు హృదయ భవన్‌లో మానసిక వికలాంగులు, పేదలకు పండ్లు, స్వీట్స్, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితతో పాటు హీరో సుమన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సుమన్, సీఎం జగన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలా మంది సీఎంల పనితీరుని చూశానన్న సుమన్, సంక్షేమ పథకాలు అమలులో జగన్.. తన తండ్రి వైఎస్‌ని మించిపోయారంటూ పొగిడారు. నిన్నటి వరకూ టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు నెరపిన సుమన్ ఒక్కసారిగా వైఎస్ కుటుంబంపై ప్రశంసలు కురిపించడంతో, ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారనే వాదన వినిపిస్తోంది.
అంతే కాదు గుంటూరు జిల్లాలో ఏదైనా ఒక నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు సుమన్ సుముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు, గత కొంత కాలంగా సమన్ తన అభిమాన సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది.