వెధర్ రిపోర్ట్- మొన్న ముంచుకొచ్చిన గులాబ్ తుఫాను నుంచి తేరుకునేలోపే మరో తుఫాను దూసుకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందినట్లు భారత వాతవరణ కేంద్రం తెలిపింది. ఈ తుఫానుకు షహీన్ అనే పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 15 కిలో మీటర్ల వేగంతో పయనిస్తోందని ఐఎండీ స్పష్టం చేసింది.
గుజరాత్ లోని దేవ్ భూమి ద్వారకకు 700 కిలోమీటర్లు, తూర్పు నైరుతిగా ఇరాన్ లో చాబర్ పోర్టుకు 240 కిలో మీటర్లు, మస్కట్ కు తూర్పు ఈశాన్యంగా 400 కిలో మీటర్ల దూరంలో షహీన్ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. షహీన్ తుఫాను వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా మక్రాన్ తీరం వైపు పయనించి, ఆ తర్వాత అది దిశ మార్చుకుని పశ్చిమ నైరుతి దిశలో ఒమన్ తీరం వైపు వెళ్లి క్రమంగా బలహీన పడుతుందని ఐఎండీ పేర్కొంది.
అక్టోబరు 4వ తేదీ తెల్లవారుజామున ఒమన్ వద్ద తుఫానుగా తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. షహీన్ తుఫాను ప్రభావం భారత్ పశ్చిమ తీరంలోని ఏడు రాష్ట్రాలపై ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో అక్టోబరు 4 వరకూ ఏ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో గంటకు 110 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని నిపుణులు తెలిపారు. శని, ఆది వారాలు రెండు రోజులూ గాలుల వేగం 130 కిలో మీటర్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, బిహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో షహీన్ తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. తీవ్ర తుపానుగా మారిన షహీన్ పాకిస్థాన్‌లోని మక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుందని తెలిపింది. ఆ తరువాత 36 గంటల్లో అది దిశ మార్చుకుని గల్ఫ్ ప్రాంతాల వైపుకు వెళ్లి, క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. షహీన్ తుఫాను తీరం దాటిన తర్వాత వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.