తెలంగాణలో ఈ ఏడాది ప్రారంభం నుంచే అనేక వివాదాస్పద, విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పేపర్ లీకేజ్ అంశం బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్.. చొరవ వల్ల బాధిత కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చారు. ఆ వివరాలు..
ఈ ఏడాది ప్రారంభం నుంచి రాష్ట్రంలో తీవ్ర వివాదాస్పద, విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ల వేధింపులు భరించలేక మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. అలానే అబ్దుల్లాపూర్‌మెట్‌లో చోటు చేసుకున్న బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని ముగ్గురు యువతీయువకుల మధ్య చోటు చేసుకున్న ప్రేమ వ్యవహారం ఎంత దారుణ పరిస్థితులకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమించిన యువతి కోసం హరి.. నవీన్‌ను అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ వివాదం ముగిసేలోపే.. పేపర్ లీకేజ్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. గ్రూప్-1 ప్రిలిమ్స్, మిగతా పరీక్షల పేపర్లు లీక్ అవ్వడం పెను సంచలనంగా మారింది. ఎందరో నిరుద్యోగుల జీవితాలు నాశనం చేసింది ఈ సంఘటన. దీనిపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వరుస సంఘటనలతో.. తెలంగాణ సమాజంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో సిరిసిల్లలోని బీవైనగర్‌కు చెందిన చిటికెన నవీన్ అనే నిరుద్యోగి ఆత్మహత్య కూడా సంచలనంగా మారింది. అది కూడా గ్రూప్-1 పరీక్ష రద్దు చేసిన మరుసటి రోజే నవీన్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సంఘటన కూడా వివాదస్పదంగా మారింది. గ్రూప్-1 రద్దు కారణంగానే నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారం సాగింది. కానీ అది వాస్తవం కాదు. ఉద్యోగం దొరకడం లేదనే ఆవేదనతో ఈ నెల 17న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నవీన్ ఆత్మహత్యపై తెలంగాణలో పెద్ద దుమారమే చేలరేగింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన నవీన్.. పరీక్ష రద్దు కావడంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. దీనికి ప్రభుత్వమే కారణమని ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాడు. అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది వాస్తవం కాకపోయినా సరే.. నవీన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. అతని కుటుంబంలో ఒకరికి పొరుగుసేవల విధానంలో ఉద్యోగం కల్పించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నవీన్ రెండో సోదరుడికి జిల్లా కేంద్రంలోని జేఎన్‌టీయూలో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉద్యోగం కల్పించారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జ్, ఎమ్మెల్సీ బస్వరాజుసారయ్య బాధిత కుటుంబానికి సంబంధిత నియామక పత్రన్ని అందజేశారు. నవీన్ మృతి చెందిన వార్త తెలుసుకున్న కేటీఆర్.. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి.. వారికి ధైర్యం చెప్పారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకే నవీన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించారు.
అయితే నవీన్ అసలు గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కాదు కదా.. కనీసం పరీక్షకు అప్లై కూడా చేయలేదని అతడి తండ్రి తెలిపాడు. తన కుమారుడు గ్రూప్-1 పేపర్ లీకేజీ కావటం వల్లే మనస్తాపం చెంది చనిపోయాడంటూ అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. 30 ఏళ్ల కుమారుడు చనిపోయి బాధలో తాము ఉంటే.. ఇలాంటి వార్తలు తమను మరింత కుంగదీస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశాడు. నవీన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముందే ఆయన ఈ విధంగా స్పందించారు. ప్రభుత్వ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.