నివాస స్థలాలు, హోటల్స్, మాల్స్, ఫ్యాక్టరీల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక మంది ఈ అగ్నిప్రమాదాల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు.
ఇటీవల కాలంలో అగ్ని ప్రమాద ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కూడా ఈ ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. నివాస స్థలాలు, హోటల్స్, మాల్స్, ఫ్యాక్టరీల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక మంది ఈ అగ్నిప్రమాదాల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు. కొంత మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. హైదరాబాద్‌లో వరుసగా అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగించిన సంగతి విదితమే. తాజాగా పాకిస్తాన్ రైలులో మంటలు చెలరేగాయి. కదులుతున్న రైలులో ఈ ప్రమాదం జరగడంతో ప్రజలు ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు. ఈ ఘటన గురువారం జరిగింది.
దక్షిణ పాకిస్తాన్‌లో ఓ రైలులో మంటలు చెలరేగడంతో కనీసం ఏడుగురు మరణించారు. ఈ ఘటన సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీకి ఉత్తరాన 500 కిలోమీటర్ల (300 మైళ్లు) దూరంలో ఉన్న ఖైర్‌పూర్ జిల్లాలో అర్థరాత్రి చోటుచేసుకుంంది. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆరుగురు మంటల్లో కాలిపోయి చనిపోగా.. ఒక మహిళ రైలు కిటీకీలో నుండి దూకేయడం వల్ల మరణించినట్లు చెప్పారు. ఈ మంటల ధాటికి రైలులోని చాలా కోచ్‌లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. కరాచీ నుండి తూర్పు నగరమైన లాహోర్‌కు వెళ్తున్న కరాచీ ఎక్స్‌ప్రెస్ రైలులో బిజినెస్ క్లాస్ కోచ్‌లో ఈ మంటలు చెలరేగడంతో.. రైలులో అనేక భాగాలు కాలిపోయాయి.
క్యారేజ్‌లో మంటలు ఎలా ప్రారంభమయ్యాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆ మంటలు ఒక భోగినుంచి మరో భోగికి అంటుకున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. ఆ తర్వాత రైలులోని మిగిలిన భాగం నుండి వేరుచేయబడిందని తెలిపారు. పాకిస్తాన్‌లో, నిరుపేద ప్రయాణీకులు తరచూ తమ భోజనం స్వయంగా వండుకోవడానికి రైళ్లలో తమతో పాటు చిన్న గ్యాస్ స్టవ్‌లను తీసుకువస్తారు. ఇలా చేయడం శిక్షార్హం, నిషేధం అయినప్పటికీ రద్దీగా.. అధికారుల కళ్లుగప్పి తెస్తుంటారు. అయితే ఈ ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తుంది. 2019లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో వంట గ్యాస్ స్టవ్ పేలడంతో రైలులో మంటలు చెలరేగడంతో కనీసం 74 మంది ప్రయాణికులు మరణించారు.