ఇంటర్నేషనల్ డెస్క్- ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. అఫ్ఘాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడి ప్రజల పరిస్థితి భయానకంగా మారింది. ప్రధానంగా అఫ్ఘానిస్థాన్‌లో ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిల్లల ఆకలిచావులు అఫ్గాన్ లో కలకలం రేపుతున్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. దీంతో తలెత్తిన ఆహార సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది.
ఇరవై రోజుల క్రితం ఆఫ్గనిస్థాన్ లోని పశ్చిమ కాబూల్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు ఆహారం లేక ఆకలితో అలమటించి చనిపోవడం కలకలం రేపుతోంది. ఈ హృదయ విదారక ఘటన ప్రపంచం దృష్టికి కాస్త ఆలస్యంగా సోమవారం వచ్చింది. చనిపోయిన 8 మంది పిల్లల తల్లి ఈ మధ్యదే గుండె జబ్బుతో చనిపోయింది. తండ్రి క్యాన్సరో తో సమస్యతో మంచానికే పరిమితం అయ్యాడు.
ఈ క్రమంలో ఈ 8 మంది పిల్లలు కాబూల్ లో అడుక్కుని తినేవారు. ఐతే ప్రస్తుతం కాబూల్ లో ఆహార సంక్షోభం ముదరడంతో వీరికి ఎవరు ఆహారం పెట్టలేదు. సుమారు ఆరు రోజుల పాటు ఆహారం లేక అలమటించిన 8 మంది పిల్లలు ఒకే రోజు ప్రాణాలు వదిలారు. ఈ విషయాన్ని మహ్మద్ అలీ బమియానీ అనే స్థానికుడు మీడియాకు చెప్పాడు.
అఫ్ఘనిస్థాన్ లోని మొత్తం 3.9 కోట్ల జనాభాలో, 2.3 కోట్ల మందికి సరిపడా ఆహారం అందడం లేదు. రెండు నెలల క్రితం తాలిబన్లు గద్దెను ఎక్కడానికి ముందు వరకు ఆహార సంక్షోభంలో ఉన్నవారి సంఖ్య 1.4 కోట్లు ఉండగా, ఇప్పుడది 2.3 కోట్లకు పెరిగిందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అఫ్ఘానీయులు తమకు ఉన్న స్థలాల్లో కొంత భాగాన్ని అమ్మేయగా వచ్చే డబ్బులతో ఆహార ధాన్యాలను కొని నిల్వ చేసుకుంటున్నారు.