టిఫిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చే ఐటమ్ ఇడ్లీ. బయట రుచికరమైన ఇడ్లీ.., ఓ మోస్తరు హోటల్ లో తినాలంటే చేతిలో 50 రూపాయలు ఉండాల్సిందే. ఇక రోడ్ పక్కన బండి మీద తిన్నా 30 రూపాయలు తప్పకుండా ఖర్చు అవుతుంది. కానీ.., ఒక ఇడ్లీ ఒక్క రూపాయికే వస్తుంది అంటే మీరు నమ్ముతారా? అసలే.. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి ఆఫర్స్ అసాధ్యం అంటారా? అయితే.., మీరు పొరబడినట్టే. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లాలోని ఓ హోటల్ లో ఇప్పుడు ఇడ్లీ రూపాయికే అమ్ముతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం దగ్గర్లోని కొత్తూరు గ్రామం ఉంది. ఆ గ్రామంలో కాకా హోటల్ కి ఘన చరిత్ర ఉంది. దీనిని 16 ఏళ్ల కింద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నాణ్యమైన టిఫిన్ ను తక్కువ ధరకే అందిస్తూ వస్తున్నారు హోటల్ యజమానులు. ఇక ఈ హోటల్ లో అమ్మే ఇడ్లీ మాత్రం వెరీ స్పెషల్. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ మెత్తటి ఇడ్లీ కోసం తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు తెల్లవారకముందే హోటల్ ముందు క్యూ కడుతుంటారు.
రోజుకు కనీసం 1000 మంది వరకు ఈ హోటల్ లో టిఫిన్ చేస్తారు. కానీ.., ఒక్కరి దగ్గర కూడా హోటల్ యజమానులు ఎక్కువ డబ్బు తీసుకోరు. ఎంతో రుచికరమైన ఆ ఇడ్లీ కేవలం ఒక్క రూపాయి మాత్రమే. ఇడ్లీ మాత్రమే కాదు.., బోండా, బజ్జీ, దోశ అన్నీ రూపాయి మాత్రమే. ఇక ఇంత తక్కువ ధరకి టిఫిన్ అమ్మితే మీకు లాభాలు ఉంటాయా అన్న ప్రశ్నకు హోటల్ నడిపే యజమానులు అద్భుతమైన సమాధానం ఇచ్చారు.
డబ్బు సంపాదించడం కాదు.. నలుగురికి నాణ్యమైన తిండి పెట్టాలన్నదే మా ధ్యేయం. రోజు మా చేతుల మీదగా ఇంత మంది ఆకలి తీరుస్తున్నాం. అంతకన్నా ఇంకేం కావాలి అన్నది వీరి సమాధానం. చూశారు కదా? బిజినెస్ అంటే విలువలు మర్చిపోయి, డబ్బు కోసం ఎగబడుతున్న ఈరోజుల్లో ఈ కాకా హోటల్ యజమానులు ఎంత ఆదర్శంగా వ్యాపారం చేస్తున్నారో. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.