అక్షయతృతీయను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే అది రెట్టింపు అవుతుందని బాగా నమ్ముతుంటారు. అయితే అక్షయతృతీయ రోజు మీరు చేసే తప్పులు కూడా అక్షయం అవుతాయని చాలా మందికి తెలియదు. అసలు ఈరోజు ఎలాంటి తప్పులు చేయకూడదో చూద్దాం.
హిందువులు భక్తిశ్రద్ధలతో చేసుకునే పండుగల్లో అక్షయతృతీయ కూడా ఒకటి. ఈరోజు బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల అవి రెట్టింపు అవుతాయని భావిస్తుంటారు. మత్స్య పురాణం ప్రకారం పరమేశ్వరుడు సర్వకామ ప్రథమైన అక్షయతృతీయ వ్రతం గూర్చి పార్వతీ దేవికి వివరిస్తాడు. వైశాఖ శుద్ధ తదియ రోజు చేసిన ఏ వ్రతమైనా, హోమమైనా, పుణ్య కార్యమైనా అక్షయం అవుతుందని చెబుతారు. అయితే మీరు గమనించాల్సింది ఇకో విషయం కూడా ఉంది. ఈరోజు మీరు చేసిన పుణ్య కార్యాలు, దానధర్మాలే కాదు.. ఈరోజు చేసే పాప కార్యాలు కూడా అక్షయం అవుతాయి. అప్పులు, తప్పులు కూడా అక్షయం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా అక్షయతృతీయ రోజు బంగారం కొనాలి అనే నమ్మకం బాగా కొనసాగుతోంది. అయితే ఈ రోజు బంగారం కొనాలి అని ఎక్కడా లేదని పండితులు కూడా వివరిస్తున్నారు. కానీ, అలా బంగారం కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది అప్పుల పాలవుతున్నారు. అలా బంగారం కొంటే అది మరింత పెరుగుతుంది అని భావిస్తారు. అయితే అందుకోసం మీరు అప్పులు చేస్తే అవి కూడా అలాగే పెరుగుతాయని చెబుతున్నారు. అంతేకాకుండా అక్షయతృతీయ పూజా విధానంలో కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈరోజు మీరు అలాంటి తప్పులు చేస్తే మీకు జీవితాంతం పేదరికం తప్పదని పండితులు హెచ్చరిస్తున్నారు.
అక్షయతృతీయ అనగానే లక్ష్మీదేవిని ఆరాధించాలని అందరికీ తెలుసు. అయితే చాలా మంది లక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తుంటారు. కానీ, శ్రీమహావిష్ణువు- లక్ష్మీ దేవిని కలిపి పూజించాలి. విడివిడిగా పూజించడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అన్నీ పండుగల మాదిరిగానే అక్షయతృతీయ రోజున కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ మూలన చీకటి లేకుండా.. ఇల్లంతా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. తులసి కోటకు పూజ చేసి దీపం పెట్టాలి. అలాగే సాయంత్రం పూట ప్రధాన ద్వారం వద్ద నెయ్యితే దీపారాధన చేయాలి. ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలని చెబుతున్నారు. అలాగే సాత్విక ఆహారమే తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. మీరు ఈరోజు ఏ తప్పులు చేసినా, ఎవరికి కీడు తలచినా అవి తిరిగి మీకు అంతే చేటు చేస్తాయంటూ పండితులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మీరు స్నానం చేయకుండా డబ్బు దాచే ప్రదేశాన్ని, బీరువా, ఖజానా వంటి వాటిని తాక కూడదని చెబుతున్నారు.