ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా ప్రబలుతోంది. ఏపీ సచివాలయ ఉద్యోగులను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో కరోనా ఉద్ధృతి దృష్టిలో ఉంచుకుని వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు లేఖ రాశారు. అనంతరం సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది ఇద్దరు సచివాలయ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పుడు ప్రారంభ దశలోనే ఏకంగా నలుగురు ఉద్యోగులు కొవిడ్తో మృతి చెందారని సచివాలయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్. ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందగా.. తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనాతో మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా మన్ననలు పొందిన రామ్ ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. గత 10 రోజులుగా చికిత్స పొందుతున్న రామ్ ప్రసాద్ చివరకు కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు సచివాలయం ఉద్యోగి యస్ కిషోర్ కుమార్ కూడా కరోనాకు బలైయ్యారు. ప్రిన్సిపల్ సెక్రటరి పేషిలో పని చేస్తున్న ఆయన కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో పోరాడి రాత్రి చనిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.రాష్ట్రంలో కరోనా తీవ్రతకు ప్రభుత్వ ఉద్యోగులు బలవుతున్నారని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తక్షణమే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల శుభ్రత, కరోనా ప్రొటోకాల్ పాటించేందుకు తక్షణమే సరిపడా నిధులను మంజూరు చేయాలని కోరారు. వైరస్ బారిన పడిన ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్ సెలవులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.