ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా ప్రయాణికులు మరణించగా 950 మంది తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు వెంటనే స్పందించి రైలు పునరుద్దరణ పనులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే ఈ ప్రమాద స్థలంలో అధికారులు సిబ్బందితో శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.
తాజాగా సిబ్బంది బయటకు తీయగా మరో 151 మృతదేహాలను గుర్తించినట్లు ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తారని, ఆ తర్వాత మృతుల కుటుంబాలకు అప్పగిస్తామని ప్రదీప్ జెనా తెలిపారు. దీనికి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. శుక్రవారం చెన్నై నుంచి బయలుదేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టడంతో కొన్ని బోగీలు పక్కనే ఉన్న మరో ట్రాక్ పై పడ్డాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో నుంచి వస్తున్న యశ్వంత్ పుర్ రైలు కిందపడ్డ కోరమండల్ బోగీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.