సిద్దిపేట- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మాటకారి. ఆయన బాష, యాస అందరిని ఆకట్టుకుంటుంది. కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలపై ఎంత ఘాటుగా మాట్లాడతారో, కొన్ని సందర్బాల్లో అంతే సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒక్కోసారి తన మాటల ద్వార అందరిని నవ్విస్తుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మాటలు ఎంత సీరియస్ గా ఉంటాయో.. అప్పుడప్పుడు మాత్రం తాను నవ్వుతూ, అందరు నవ్వేలా కామెంట్స్ చేస్తుంటారు. ఇదిగో సిద్దిపేట పర్యటన సందర్బంగా సీఎం కేసీఆర్ కరోనాపై మాట్లాడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు.
ప్రధానంగా తనకు కరోనా ఎలా సోకిందో చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. సరిగ్గా ఆయన మాటల్లో వింటే.. కరోనాతో మూతికో బట్ట, ముడ్డికో బట్ట.. ఇదేం పంచాయితీయో.. నవ్వొస్తోంది. పెండ్లికి పోతే పెళ్లి పిల్లగాడు సార్ మాస్క్ తీయ్ అన్నాడు. ఎందుకురా భయ్ అంటే నువ్వు మళ్లా దొరుకుతావా సర్.. ఫొటో కావాలి అన్నాడు. నేను నీకు దొరుకుతానోలేదో గానీ మాస్క్ తీస్తే కరోనాకు దొరుకుతా కదరా భయ్ అన్నా. అలా వాడు గుంజి.. వీడు గుంజి నాక్కూడా వచ్చింది కరోనా.. అని అన్నారు సీఎం కేసీఆర్.
ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు కరోనా ఎలా సోకిందో సరదాగా చెప్పడంతో అక్కడున్నవాళ్లంతా నవ్వేశారు. చాలా రోజుల తరువాత సీఎం ఇలా కూల్ గా మాట్లాడారని మంత్రులు, టీఆర్ ఎస్ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని జిల్లా పర్యటనకు వెళ్లిన కేసీఆర్, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు వరాల జల్లులు కురిపించి వచ్చారు.