హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో 13 రోజుల పాటు నిర్విగ్నంగా జరిగిన శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఈ క్రమంలో సహస్రాబ్ధి ఉత్సవాల రెండవ రోజు ముచ్చింతల్ వచ్చిన సీఎం కేసీఆర్, ఆ తరువాత అటు వైపు రాలేదు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వచ్చిన సందర్బంగా కూడా కేసీఆర్ రాకపోవడంతో అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ దూరం పెరిగిందన్న ప్రచారం ఉపందుకుంది.
ఇదిగో ఇటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో విభేదాలపై చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో తమకు విభేదాలు ఎందుకుంటాయని ఆయన మీడియాను ప్రశ్నించారు. కేసీఆర్ సహకారంతోనే రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాలు జరిగాయని స్వామీ తెలిపారు. ఈ ఉత్సవాలకు మొదటి సేవకుడిని తానేనని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని చిన్న జీయర్ స్వామి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యం, పని ఒత్తిడి కారణంగా ఉత్సవాలకు రాలేకపోయి ఉంటారని చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోనే ప్రతిపక్షాలు, స్వపక్షాలు ఉంటాయని.. భగవంతుడి ముందు అంతా సమానమేనని ఆయన స్పష్టం చేశారు. శనివారం 108 ఆలయాల మూర్తులకు శాంతి కల్యాణం జరుగుతుందని, అందరికీ ఆహ్వానాలు పంపామని చిన్న జీయర్ తెలిపారు.