తిరుపతి- నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. ఇప్పుడు ఈ పాట తెలియని తెలుగు వారుండరేమో. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి ఈ బుల్లెట్ పాట నచ్చేసింది. మంచిర్యాలకు చెందిన కొత్త పెళ్లి కూతురు సాయిశ్రియ ఈ పాటకు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా బుల్లెట్ బండి పాట పాపులర్ అయ్యింది. అప్పటి వరకు కొంత మందికే తెలిసిన ఈ బుల్లెట్ పాట బాగా వైరల్ అయ్యింది. ఆ తరువాత తెలంగాణలోనే ప్రభుత్వ ఆస్పత్రి నర్స్ ఈ పాటపై డ్యాన్స్ చేయడం సంచలనంగా మారింది.
మంచిర్యాల పెళ్లి కూతురు బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేశాక, చాలా మంది స్టెప్పులేశారు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని తెలుగు వారు చాలా మంది ఈ పాటపై డ్యాన్స్ లు చేస్తున్నారు. ఇక పెళ్లిళ్లలో ఐతే చెప్పక్కర్లేదు.. బుల్లెట్ బండి పాటలేనిదే పెళ్లి జరగడం లేదంటే అతియోశక్తి కాదేమో. తాజాగా రాజకీయ కుటుంబాలకు చెందిన వారు సైతం బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్స్ వేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఉపముఖ్య మంత్రి నారాయణ స్వామి 42వ వివాహ వార్షికోత్సవం తిరుపతిలో నిర్వహించారు. తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య ఈ పెళ్లి రోజు వేడుకను జరిపారు. ఈ సందర్భంగా బుల్లెట్ బండి పాటకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి సరదాగా డ్యాన్స్ చేశారు. భర్త సోఫాలో కూర్చోగా, ఆయన ఎదుట ఆమె డ్యాన్స్ చేసిన వీడియో అందర్నీ అలరిస్తోంది.
ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తన పెళ్లి రోజు సందర్బంగా సరదాగా గడిపారు. బుల్లెట్ బండి పాటకు తన భార్య డ్యాన్స్ చేయడంతో ఆయన కూడా ఎంజాయ్ చేశారు. ఆమె డ్యాన్స్ ను కుటుంబ సభ్యులంతా ఆస్వాదించారు. మొత్తానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సతీమణి డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.