స్పెషల్ డెస్క్- పెళ్లి అంటేనే సరదా, సందడి. పెళ్లి వేడుకలో చుట్టాలు, స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక పెళ్లిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును వారి వారి ఫ్రెండ్స్ ఆటపట్టించడం మామూలు విషయమే. ఈ ఆటపట్టించడం కొంత వరకు బాగానే ఉన్నా, అది సృతి మించితేనే సమస్య అవుతుంది. ఇదిగో ఇక్కడ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఇచ్చిన బహుమతి చూసి ఆమెకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఇంకేముంది వధువు ఆ గిఫ్టును పక్కకు విసిరేసింది.
ఇది సరిగ్గా ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. భారత్ లో జరిగిందని తెలుస్తోంది. వివాహం జరిగాక రిసెప్షన్‌లో భాగంగా వధు వరులు వేదిక మీద కూర్చున్నారు. ఈ క్రమంలో వరుడి స్నేహితులు వధువు కోసం ఒక బహుమతి తీసుకొచ్చారు. దాన్ని పెళ్లి కూతురు చేతిలో పెట్టి, తమ ముందే ఆ గిఫ్ట్ ప్యాకెట్ విప్పాలని కోరారు. దీంతో అందరి ముందే వధువు ఆ గిఫ్టు ప్యాకెట్ ను విప్పి చూసింది.
అందులో చిన్న పిల్లలకు పాలుపట్టే పాల డబ్బా ఉండటంతో పెళ్లి కూతురుకు కోపం వచ్చింది. ఆ బహుమతి తెచ్చిన వరుడి స్నేహితుల వైపు కోపంగా చూస్తూ దాన్ని పక్కన పడేసింది. వాళ్లు ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా కింద పడేసిన పాల డబ్బాను తీసి మళ్లీ పెళ్లి కూతురుకు ఇచ్చారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని కోపంగానే తీసుకుంది వధువు.
దీన్ని బంటీ ఠాకూర్ అనే వ్యక్తి వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. గిఫ్ట్ ప్యాకెట్ ను ఓపెన్ చేసి పాల డబ్బాను చూడగానే వధువు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ చూసి నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోను కోటి మందికి పైగా వీక్షించారు. మూడు లక్షల మందికి పైగా లైక్ లు కొట్టారు.