కరోనా వైరస్ వణికిస్తుంటే ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అని పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. మ్యుకర్ మైకోసిస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్నాళ్లూ ఇతర రాష్ట్రాల్లో కలవరపెట్టిన బ్లాక్ ఫంగస్ కేసులు తాజాగా తెలంగాణలో కనిపిస్తున్నారు. తాజాగా బ్లాక్ ఫంగస్‌లో హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు కరోనా రోగుల్లోనూ ఈ లక్షణాలను డాక్టర్లు గుర్తించారు. సహజసిద్దంగా గాలిలో మ్యూకోర్ అనే ఫంగస్ ఉంటుంది. దీనిని పీల్చినపుడు గాలిద్వారా ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కరోనా నుంచి కోలుకునే సమయంలో తలెత్తే సమస్యల వలన ఆ బ్లాక్ ఫంగస్ కంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా కంటిచూపు కోల్పోవాల్సి వస్తుంది.
కంటిపై దాడి తర్వాత ఈ ఫంగస్ మెదడు వరకు వ్యాపిస్తుంది. మెదడుకు ఈ ఫంగస్ చేరడం వల్ల బ్రెయిన్ డెడ్ అయి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొవిడ్-19 కారణంగా ఊపిరితిత్తుల్లో వచ్చే మంటను తగ్గించడానికి స్టెరాయిడ్లను వాడుతున్నారు. తీవ్ర డయాబెటిస్‌తో బాధపడుతున్న కరోనా రోగులకు కూడా ఈ స్టెరాయిడ్లను ఇస్తున్నారు. ఈ స్టెరాయిడ్ల ప్రభావం వల్ల ఇమ్యూనిటీ తగ్గి రక్తంలో చక్కెరస్థాయులు పెరుగుతున్నాయి. ఇలా రోగనిరోధక శక్తి తగ్గిన వారిలో బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉందని ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ మనీష్ ముంజాల్ హెచ్చరిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ అనేది కరోనావైరస్‌లా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ సోకిన తర్వాత లక్షణాలను ముందే గుర్తించి చికిత్స ఇవ్వడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడవచ్చు. మ్యూకోర్‌మైకోసిస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను ఇస్తుంటారు. 15 నుంచి 21 రోజుల పాటు ఈ ఇంజెక్షన్లను ఇవ్వాలి. రోగి బరువును బట్టి ఇవి రోజుకు 6 నుంచి 9 ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే రోగి ముక్కు నుంచి ఫంగస్‌ను తొలగించేందుకు శస్త్ర చికిత్స కూడా చేస్తుంటారు. ఆపరేషన్ తర్వాత కూడా ఈ ఇంజెక్షన్లను కొనసాగిస్తారు.