పాడి ఆవులు ఒకప్పుడు ఇంట్లో భాగంగానే ఉండేవి. రైతులు వాటిని ఇంట్లో మనుషులు గానే చూసే వారు. మర్యాదరామన్న సినిమాలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. పాడి ఆవులకు అంతటి విశిష్టత స్థానం ఉంది. కానీ.., కాల క్రమేణ పాడి చేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అమ్మ లాంటి గో రక్షణ కోసం ప్రత్యేకంగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఓ కుటుంబం సాంప్రదాయ బద్ధంగా లేగదూడకి బారసాల ఫంక్షన్ నిర్వహించింది. ఊరందరినీ ఈ వేడుకకి పిలిచి గ్రాండ్ గా ఫంక్షన్ చేసింది.
మన ఇంట చిన్న పిల్లలకు 21 రోజుల తర్వాత బారసాల వేడుక నిర్వహిస్తాం. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య బారసాల వేడుక ఘనంగా నిర్వహించుకుంటాం. అయితే కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బీచ్ రోడ్డులోని డాబాల సెంటర్‌లో నివసించే మైథిలి కుటుంబం లేగదూడకి ఇలాగే బారసాల చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. మైథిలి కొన్నాళ్లుగా ఓ ఆవును పెంచుకుంటోంది. ఆ ఆవు పేరు బంగారం. ఆ బంగారానికి జులై 6వ తేదీన దూడ జన్మించింది. దాంతో వారి సంతోషానికి అవధుల్లేకుండాపోయాయి.
ఈ నేపథ్యంలోనే ఆ లేగదూడకు తాజాగా ఘనంగా బారసాల జరిపించారు. ఇంట్లో ఉయ్యాల కట్టి పూలతో అందంగా అలంకరించారు. మంగళహారతులు పట్టించి, ఉయ్యాల పాటలు పాడారు. అందరికీ విందు భోజనాలు వడ్డించారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.., యజమాని మైధిలి ఈ విషయంలో స్పందించారు. మూగజీవాలను కుటుంబ సభ్యులుగా చూడటం వల్ల వాటిపై అమితమైన ప్రేమను పెంచుకున్నట్లు మైథిలి చెప్పారు. మరి.., లేగదూడకి బారసాల నిర్వహించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.