హైదరాబాద్- భారత క్రికెట్ మాజీ కెప్టన్ అజారుద్దీన్ పై వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్ వ్యవహారం చాలా రోజులుగా వివాదాస్పదమవుతోంది. ఈ నెల 2న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్‌కౌన్సిల్ అజారుద్దీన్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 11న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. ఈ బేటీకి అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగడం వివాదానికి దారి తీసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ నాయకత్వంపై ఆ మధ్య తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను అజారుద్దీన్ ప్రోత్సహించడంలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని లక్ష్మీనారాయణ ఆరోపించారు. అజార్ పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంలో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి, ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని యెండల లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అంతే కాదు సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం హెచ్‌సీఏలో జరుగుతున్న అవకతవకలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పూర్తి ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు..