అమెరికా, యూర్‌పలో కొవిడ్ ఆంక్షలను సడలించారు. ఆయా దేశాల్లో క్రమంగా వివిధ కార్యకలాపాలు మొదలవుతున్నాయి. కొవిడ్ మొదలైన 13 నెలల తర్వాత అమెరికాలో విమాన యానం చేసిన వారి గరిష్ఠ స్థాయికి చేరింది. అదే సమయంలో తమ ఖండానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను సడలించాలని యూరోపియన్ యూనియన్ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. అక్టోబరు తర్వాత మొట్టమొదటిసారిగా అమెరికాలో రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య 50 వేల లోపు పడిపోయింది. అమెరికా ఎయిర్‌పోర్టులలోని చెక్ పాయింట్లలో ఆదివారం 1.67 మిలియన్ల మందిని స్ర్కీనింగ్ చేశామని, గత ఏడాది మార్చి తర్వాత ప్రయాణికుల సంఖ్య ఇంత భారీగా వచ్చిందని అమెరికా రవాణా భద్రతా శాఖ వెల్లడించింది.
అమెరికాలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలను సడలించారు. లాస్‌ఏంజిలిస్ లో క్యాసినోలకు 80ు సందర్శకులు వెళ్లేలా ఆంక్షలను సడలించారు. న్యూయార్క్‌లో సబ్ వేలు రాత్రంతా తెరచి ఉంటాయని ప్రకటించారు. అదే సమయంలో పగలు వివిధ వ్యాపార సంస్థలకు వచ్చే కస్టమర్ల పరిమితిని ఎత్తేశారు. ఆది, సోమ వారాల్లో లాస్‌ఏంజిలిస్ రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదు కాలేదు. డెట్రాయిట్ నగరంలో ఆరోగ్య బృందాలు 5 వేల ఇళ్లకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ ఇచ్చాయి. కొన్ని నెలలపాటు పట్టి పీడించిన కరోనా ఆయా దేశాలను కోలుకోలేని దెబ్బతీసింది. ఇప్పుడు పరిస్థితి మెల్లమెల్లగా కుదుటపడుతోంది. అమెరికా, యూర్‌పలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. భారత్‌లో నమోదవుతున్న కొవిడ్ కేసులతో పోలిస్తే చాలా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగ్గా ఉంది.