కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీజెపీ చందన సీమలోని ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. స్టార్ నటులు కిచ్చా సుదీప్, దర్శన్‌లు బుధవారం బీజెపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో కిచ్చా సుదీప్..
కర్ణాటకలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. వచ్చే నెల 10న జరగబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీలోకి శాండిల్ వుడ్ నటులు చేరుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కన్నడ సూపర్ స్టార్స్ కిచ్చా సుదీప్, దర్శన్‌లు బుధవారం మధ్యాహ్నం బీజెపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి రాకతో కన్నడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుందని భావిస్తున్నారు. బెంగళూర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై వీరిని పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. కర్నాటకలో ఈసారి అధికార పార్టీకి గట్టి పోటీ ఎదురు కానుండటంతో.. కన్నడ సీమలోని ప్రముఖులను రంగంలోకి దించనుంది బీజెపీ.
అయితే ఈ సమయంలో నటుడు కిచ్చా సుదీప్‌కు బెదిరింపులు వచ్చాయి. సుదీప్‌ను బెదిరిస్తూ ఆయన మేనేజర్ జాక్ మంజుకి లేఖ వచ్చింది. ఇందులో ఆయన వ్యక్తిగత వీడియోలు విడుదల చేస్తామని బెదిరించడంతో పాటు దుర్బాషలాడారు. దీంతో మేనేజర్ పోలీసులకు ఫిర్యాదునిచ్చారు. దీనిపై బెంగళూరులోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 120 బి, 506 మరియు 504 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసును సెంట్రల్ క్రైమ్ బ్రాంచుకు బదిలీ చేయాలని సీనియర్ పోలీస్ అధికారులు యోచిస్తున్నారు.
కాగా, బీజెపీలో చేరుతున్నారన్న వార్తలపై సుదీప్ స్పష్టత నిచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తనకు కష్టకాలంలో నిలిచిన స్నేహితులకు అండగా నిలిచేందుకు వారి తరుపున ప్రచారంలో పాల్గొంటానని మీడియా వేదికగా తెలిపారు. తన మేనేజర్ కు టికెట్ ఇవ్వాలని కోరలేదని పేర్కొన్నారు. ఈ సారి కర్ణాటకలో ప్రజా గాలి ఎటు వీస్తుందో తెలియడం లేదు. అయితే బీజెపీ గెలవాలంటే మాత్రం ఎదురీదక తప్పదు. అటు జనతాదళ్ సెక్యులర్ (జెడిఎస్) కూడా ఒంటరి పోరుకు సిద్ధమైంది. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని జెడిఎస్ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమార స్వామి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.