సరేలే అని ఆ ప్రముఖ హీరోయిన్.. ఫొటో తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. ఆ కుర్రాడేమో హీరోయిన్ కు తెలియకుండా వీడియో తీసేశారు. అది కూడా చాలా బ్యాడ్ గా తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
హీరో లేదా హీరోయిన్స్ ని మనం అభిమానిస్తాం, ప్రేమిస్తాం. ఇంకా చెప్పాలంటే సదరు సెలబ్రిటీలు తీసే సినిమాల్ని వాళ్ల కంటే మనమే ఎక్కువగా ఓన్ చేసుకుంటాం. ఇక్కడి వరకు ఎవరికీ ఎలాంటి సమస్య లేదు. కానీ కొందరు మాత్రం ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ శ్రుతిమించిన పనులు చేస్తున్నారు. వీడియోల ద్వారా, లేదంటే సదరు సెలబ్రిటీలు ఏదైనా ఇంటర్వ్యూలో ఆ సంఘటనల గురించి చెప్పినప్పుడే ఆ విషయాలు బయటకొస్తుంటాయి. మొన్నీ మధ్య స్టార్ హీరోయిన్ అలియా భట్.. ఇలాంటి దాని గురించి చెప్పగా.. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ తాజాగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వెల్లడించింది. ఇది కాస్త నెటిజన్స్ మధ్య చర్చకు కారణమైంది.
ఇక విషయానికొస్తే.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ యామీ గౌతమ్. ‘నువ్విలా’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలు చేసింది. తను చేసిన తెలుగు చిత్రాలు హిట్ కాకపోవడంతో ఆమెకు ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్ కు షిప్ట్ అయిపోయింది. 2012లో ఫస్ట్ టైం హిందీ మూవీలో యాక్ట్ చేసిన యామీ.. 2017 నుంచి పూర్తి అక్కడే నటిస్తూ బిజీగా మారిపోయింది. 2021లో డైరెక్టర్ ఆదిత్య ధర్ ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ‘లాస్ట్’ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అయితే తన లైఫ్ లోనూ ఓసారి అభిమాని వల్ల చాలా ఇబ్బందిపడ్డట్లు చెప్పుకొచ్చింది.
‘ఈ రోజుల్లో వీడియో ఎప్పుడు ఎలాగైనా తీస్తున్నారు. అది కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండానే. గతేడాది నేను హిమాచల్ ప్రదేశ్ లోని మా ఊరికి వెళ్లాను. అప్పుడు ఓ కుర్రాడు.. నా స్టాఫ్ దగ్గర అనుమతి తీసుకుని నాతో ఫొటో దిగేందుకు వచ్చాడు. నేను కాస్త ఓపెన్ గా మాట్లాడుతూ అతడితో ఫొటో దిగాను. అది చిన్న టౌన్ కాబట్టి ప్రజలు అలా రావడం, మాట్లాడటం చాలా సాధారణ విషయం. అది నాకు సంతోషంగానే అనిపించింది. కానీ అతడు ఫొటో కోసం వచ్చి నా వీడియో తీశాడు. అది కూడా చాలా బ్యాడ్ వీడియో. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాడు. ఆ వీడియో సక్సెస్ అయిందని సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాడు. ఆ వీడియో చూసిన తర్వాత కెమెరా పట్టుకుని మా ఇంటికి చాలామంది వచ్చారు. నేను ఒక్కసారిగా షాకయ్యాను. ఇలాంటి వాటి వల్ల నెక్స్ట్ జనరేషన్ కు ఇది చాలా సాధారణ విషయమని హింట్స్ ఇస్తున్నాం. కాబట్టి నేను వాళ్లని వద్దని వారించి పంపేశాను. వ్యక్తిగత జీవితంలో ఇలాంటి వాటికి ప్రైవసీ కచ్చితంగా ఉండాలి’ అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చింది.